26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

10 Nov, 2015 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 26 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని సోమవారం పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) నిర్ణయించింది. 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సమావేశాల తొలి రెండు రోజులను ప్రత్యేకంగా నిర్వహించాలని హోంమంత్రి అధ్యక్షతన సమావేశమైన సీసీపీఏ నిర్ణయించింది.

‘ఈ సంవత్సరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషిని నవంబర్ 26, 27 తేదీల్లో స్మరించుకుంటాం.  ఆ రెండు రోజులు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఉండవు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

మరిన్ని వార్తలు