పతంజలి ప్రతినిధులు జెండాలు పాతేశారు...

29 Jun, 2017 09:49 IST|Sakshi
పచ్చని పల్లెల్లో ‘పతంజలి’ పడగ!

►పతంజలి కోసం దళితులు, బలహీన వర్గాల భూములు
►40 ఏళ్ల క్రితం నుంచి సాగు చేసుకుంటున్న రైతులు
►బలవంతంగా 137 ఎకరాల భూసేకరణ
►అధికార పార్టీ నేతల భూములకు మాత్రం మినహాయింపు
►ఎకరా రూ.75 లక్షలు పలికే భూమి రూ.2.50 లక్షలకే
►ఐదు గ్రామాల రైతుల దీనగాథ

చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, గొల్లపేట, భీమాళి.. ఇవి ఉత్తరాంధ్రలో చాలా చిన్న గ్రామాలు. కరవొచ్చి ఊళ్లకు ఊళ్లే వలస వెళ్లినా ఈ గ్రామ ప్రజలకు అదేంటో తెలియదు. కారణం ఈ గ్రామాల్లో తయారయ్యే మామిడి తాండ్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుండటమే. కానీ ఇప్పుడీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి.

కన్నీరు పెట్టని ఇల్లు లేదు. తృప్తిగా పట్టెడన్నం తిని చాలా రోజులైంది. ఈ గ్రామాలపై పతంజలి సంస్థ కన్నుపడ్డప్పటి నుంచీ ఇదే పరిస్థితి. వాళ్ల భూములను ప్రభుత్వం కబళించి పతంజలికి కట్టబెట్టింది. రాళ్లూరప్పలు, గుట్టలు చదును చేసి తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిపై హక్కు లేదంటోంది. కన్నబిడ్డల్లా పెంచుకున్న పచ్చటి మామిడి, జీడి మామిడి తోటలను అధికారులు నరికేస్తామంటున్నారు. ఇదీ ఆ ఐదు గ్రామాల రైతుల దైన్య స్థితి.

విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిధిలోని ఈ గ్రామాలు విశాఖపట్నానికి 35 కి.మీ దూరంలో ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం వృధాగా ఉన్న భూములను 130 రైతు కుటుంబాలు బాగు చేసుకుని మామిడి, జీడి తోటలను సాగు చేస్తున్నాయి. ఆ రైతులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వమే డీ పట్టాలు కూడా ఇచ్చింది. ఎకరా రూ.75 లక్షలు పలుకుతోంది.

ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడతామంటూ పతంజలి సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఈ ఐదు గ్రామాల్లో దళిత, బలహీనవర్గాలకు చెందిన 137 ఎకరాలను ప్రభుత్వం ఈ సంస్థకు కట్టబెట్టింది. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా కనీసం రూ.25 లక్షలైనా ఉంటుందని కలెక్టర్‌ చెప్పినా.. పతంజలికి ఎకరా రూ.2.5 లక్షలకే అప్పగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. పతంజలి ప్రతినిధులు జెండాలు కూడా పాతేశారు.

రైతులకు తెలియకుండానే..
పతంజలికి భూములు కేటాయించే వరకూ రైతులెవరికీ దీని గురించి తెలియదు. గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ తీర్మానం చేయించారు. తర్వాత రైతులు ఎదురుతిరగడంతో ప్రభుత్వం అనేక రకాలుగా వారిని మభ్యపెట్టింది. మొదట ఎకరాకు రూ.25 లక్షలని, తర్వాత రూ.15 లక్షలని, ఇప్పుడు కేవలం రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని రైతులు తెలిపారు. దీన్ని కూడా పూర్తిగా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రికార్డు పరంగా ఉన్న భూమికే పరిహారం ఇవ్వడం వల్ల సగం మంది రైతులు నష్టపోనున్నారు. భూమిని కొనుగోలు చేసిన రైతులకు ఇది కూడా ఇవ్వడం లేదు. భూమార్పిడి నిషేధం (పీవోటీ) చట్టాన్ని ముందుకు తెచ్చి 25 మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చినరావుపల్లి గ్రామస్తులు చెప్పారు.

పెద్దల భూములను వదిలేసి..
ఈ గ్రామాల్లో అధికార పార్టీ నేతల భూములున్నప్పటికీ వాటి జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. చినరావుపల్లి రెవెన్యూ పరిధిలోని 88, 89, 92, 93, 104, 105 సర్వే నెంబర్లలోని పేద రైతుల భూముల పక్కనే జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లగుడు సింహాద్రి సోదరుడు ఎర్రినాయుడి భూమి ఉంది. ఆ పక్కనే జీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ క్వారీ ఉంది. ఇందులో సెంటు భూమి కూడా పోకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ పేరుతో ఉన్న 16.8 ఎకరాలను కూడా పతంజలికిచ్చే భూముల జాబితాలోంచి తొలగించడం గమనార్హం.

ఉపాధీ ఉత్తమాటే!
భూములు కోల్పోయే ఐదు గ్రామాల్లో దాదాపు వేయి మంది వరకు జనాభా ఉంటారు. వీళ్లంతా మామిడి, జీడి మామిడి తోటలను సాగు చేస్తూ బతుకుతున్నారు. ఇప్పుడీ అవకాశం ఉండదు. వీళ్లకు మరో పని కూడా తెలియదు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే రూ.7.5 లక్షలను కుటుంబంలో ముగ్గురు వరకూ పంచుకోవాలి. ఇలాంటి కుటుంబాలు 45 వరకూ ఉన్నాయి. కేటాయించిన భూముల్లో ఆయుర్వేదిక ఉత్పత్తులు తయారుచేస్తామని ప్రభుత్వానికి పతంజలి నివేదిక సమర్పించింది. ఈ రంగంలో అనుభవం, అవగాహన ఉన్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని పేర్కొంది. దీన్ని బట్టి స్థానికులకు ఎవరికీ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదు.

ఎక్కడికి పోవాలి...
మాది చినరావుపల్లి. నాకు 1.40 ఎకరాల భూమి ఉంది. మాకు తెలియకుండానే మా పొలంలో జెండాలు పాతారు. ఎమ్మెల్యే, అధికారుల చుట్టూ తిరిగా. మొదట్లో ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఆ తర్వాత రూ.7.50 లక్షలు అన్నారు. అది కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. అందరికీ ఉద్యోగాలు వస్తాయని మొదట్లో చెప్పారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారు. - బొబ్బిలి అర్జున్‌, బాధిత రైతు

ఎలా బతకాలి?
మా నాన్న 1981లో 1.33 ఎకరాలు వేరే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. ఈ భూమి పీవోటీ పరిధిలో ఉంది కాబట్టి పరిహారం కూడా ఇవ్వమంటున్నారు. ఉద్యోగం కూడా ఇస్తామని కలెక్టర్‌ చెప్పారు. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు. మా కుటుంబం ఎక్కడికి వెళ్లాలి? ఎలా బతకాలి? - బొబ్బిలి ఎర్రయ్య, బాధిత రైతు

మాయమాటలు చెప్పి
నేను వికలాంగుడిని. నాకున్న రెండు ఎకరాలు లాగేసుకుంటున్నారు. ఈ భూమి లేకుండా బతకలేను. జాయింట్‌ కలెక్టర్‌ను కలిసినా కనికరించలేదు. అన్యాయం జరగదని మాయమాటలు చెప్పి భూమి లాక్కున్నారు. -పెట్ల ఎర్రయ్య, బాధిత రైతు

అడ్డుపడితే గెంటేశారు..
చెప్పకుండానే నా పొలంలో జెండాలు పాతారు. అడ్డుపడితే గెంటేశారు. భూమి తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటా. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు చెప్పా. ఇన్నాళ్లూ ప్రభుత్వ భూమిలో ఫలసాయం తిన్నారు కదా అంటూ చులకనగా మాట్లాడారు. -సీర సన్యాసి, బాధిత రైతు

మరిన్ని వార్తలు