లేని క్యాన్సర్లకు వైద్యం.. డాక్టర్కు 45 ఏళ్ల జైలు

12 Jul, 2015 17:02 IST|Sakshi
లేని క్యాన్సర్లకు వైద్యం.. డాక్టర్కు 45 ఏళ్ల జైలు

డెట్రాయిట్: ఉన్న రోగాలకే సరిగా వైద్యం చేయలేకపోతున్న వైద్యులున్న నేటి రోజుల్లో అసలు లేని రోగాలను అంటగట్టి అవి ఉన్నాయని భ్రమల్లో నింపి చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడికి 45 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫరీద్ ఫాటా(50) అనే వైద్యుడు డెట్రాయిట్లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తారు. అయితే, తనవద్దకు వచ్చే రోగులకు పలు పరీక్షలు నిర్వహించి వారికి క్యాన్సర్ లేకపోయినా ఉందని చెబుతూ లేని రోగానికి వైద్యం అందించడం మొదలు పెట్టారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదో ఎంతోమందికి ఆయన అబద్ధాలు చెప్పి క్యాన్సర్ రోగుల మాదిరిగా వైద్యం అందిస్తున్నారు.

ఇవన్నీ కూడా ఆయన డబ్బుకు ఆశపడే చేసినట్లు కోర్టు నిర్దారించింది. ఇది ఒక రకంగా మనీ లాండరింగ్కు పాల్పడటమేనని కూడా స్పష్టం చేసింది. దేశంలోనే ఆయనొక ఘరానా మోసగాడంటూ న్యాయవాదులు కోర్టులో ఆ వైద్యుడికి వ్యతిరేకంగా ఆధారాలు నిరూపించారు. దీంతో కోర్టు అతడికి 45 ఏళ్ల జైలు శిక్షను విధించింది. భారీ మొత్తంలో జరిమానా వేసింది. ఈ సందర్భంగా డాక్టర్ ఫరీద్ ఫాటా తన నేరాన్ని అంగీకరించాడు. తనపై రోగులకు ఉన్న నమ్మకాన్ని డబ్బుగా మార్చుకున్నానని చెప్పారు. తాను చేసింది ఓ సిగ్గుమాలిన పని అని, ముఖం చూపించేందుకు అనర్హుడినంటూ మీడియాకు తెలిపారు. ఎంతోమందికి కీమో థెరపీ వంటి చికిత్సను కూడా చేశానని, అమాయకులను చేసి వారిని మోసం చేసినందుకు తనను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నట్లు జైలుకు వెళ్లే ముందు ఫరీద్ ఫాటా చెప్పాడు.

మరిన్ని వార్తలు