ముగ్గురు భార్యలతో ఒకే ఇంట్లో..

26 Jul, 2016 19:48 IST|Sakshi
ముగ్గురు భార్యలతో ఒకే ఇంట్లో..

న్యూజెర్సీ: భార్యలపై కొందరు సృష్టించిన జోకులను సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందట! 'ఒక ఒరలో రెండు కత్తులైనా ఇముడుతాయేమో గానీ రెండు సిగలు (ఇద్దరు స్త్రీలు) కలిసుండలేవ'నే తరహా సామెతలకు కాలం చెల్లిందట! ఒకడు ఒక భార్యను ఏలుకునేందుకే నానా తంటాలు పడుతోంటే.. ఒకావిడ ఒకడితో కలిసుండటానికే వందరకాలుగా ఆలోచిస్తోంటే.. ఈ నలుగురూ మాత్రం సంసార సేద్యాన్ని సాఫీగా చేసుకుంటున్నారు. ఫలితంగా ఆనందాన్ని, పిల్లల్ని పొందుతున్నారు.

32 ఏళ్ల పౌలీ హుస్సెల్ ఓ ఫ్యాషన్ బిజినెస్ మేన్. ఉండేది అమెరికాలోని న్యూజెర్సీలో. తనను తాను 'Lord of the wives' (భార్యామణుల దేవుడు)గా పరిచయం చేసుకునే పౌలీకి ముగ్గురు భార్యలు, వారి ద్వారా పుట్టిన ముగ్గురు పిల్లలున్నారు. అందరూ ఉండేది ఒకే ఇంట్లో!


పన్నెండేళ్ల కిందట.. సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో చదువుకున్న పౌలీ.. తన సహోధ్యాయి వెనెస్సాను ప్రేమించి పెళ్లాడాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలకు చెడింది. దీంతో రెండేళ్ల కిందట విడిపోయారు. భార్యాపిల్లలు దూరమైన బాధతో పౌలీ డిప్రెషన్ లోకి పోబోతున్న సమయంలో ల్యాడీ, హజెల్ అనే ఇద్దరు యువతులు పరిచయం అయ్యారు. వాళ్లు కలిసింది వేర్వేరు సందర్భాల్లోనే అయినా కొంతకాలానికి ముగ్గురూ కలిసి ఉండటం మొదలుపెట్టారు. భర్త వేరేవాళ్లతో ఉంటున్నాడని తెలియగానే ఉక్రోషంతో ఊగిపోయిన మొదటి భార్య.. తిరిగి భర్త చెంతకు చేరుకుంది. అప్పుడు మొదలైంది అసలైన పౌలీగమీ!

అటు మొదటిభార్య ప్రేమను మర్చిపోలేక.. రెండో, మూడో భార్యలను వదులుకోలేక చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి ముగ్గురు భార్యలూ సమ్మతి తెలిపారు. 'కలిసి ఉంటే కలదు సుఖం' అన్నదే పౌలీ నిర్ణయం! ఆడాళ్లు ముగ్గూరూ కలిసి వంటచేస్తారు. బయటికి వెళ్ళినప్పుడు 'sister wives' టీషర్టులు ధరిస్తారు. ఒక్కో భార్యతో కొన్ని రోజులు ప్రత్యేకంగా డేట్ కు వెళ్తూ వాళ్లకు నచ్చిన విధంగా నడుచుకోవడం, ముగ్గురినీ సమానంగా చూడటం తన విజయ రహస్యమని చెబుతాడు పౌలీ.

మరిన్ని వార్తలు