పెరిగిన లెసైన్సు ఫీజు చెల్లించాల్సిందే!

16 Feb, 2016 04:20 IST|Sakshi

డిస్టిలరీలు, బ్రూవరీలకు ఎక్సైజ్ శాఖ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మద్యం, బీరు, ఈఎన్ఏ ఉత్పత్తులపై లెసైన్సు ఫీజును వందశాతం పెంచిన ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను వ్యత్యాసపు మొత్తాన్ని వసూలు చేసే చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రంలో 17 డిస్టిలరీలు, 6 బ్రూవరీలు, 14 ఈఎన్ఏ (స్పిరిట్) ఉత్పత్తి చేసే కంపెనీలున్నాయి. వీటి లెసైన్సు ఫీజును గత అక్టోబర్ నుంచి రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ప్రూఫ్ లీటర్ ఐఎంఎఫ్ఎల్ మద్యంపై గతంలో ఒక రూపాయి లెసైన్సు ఫీజును వసూలు చేసేవారు.

అలాగే బీరుకు సంబంధించి 200 లక్షల బల్క్ లీటర్ల ఉత్పత్తికి రూ. 50 లక్షలు ఫీజుగా ఆబ్కారీ శాఖ వసూలు చేసేది. ఈ లెక్కన డిస్టిలరీలు, బ్రూవరీలు, ఈఎన్ఏ కంపెనీల నుంచి లెసైన్సు ఫీజు రూపంలో ఏటా రూ. 35 కోట్లు వసూలయ్యేది. ఇప్పుడు గత అక్టోబర్ నుంచి లెసైన్సు ఫీజును రెట్టింపు చేసినందున 2015 అక్టోబర్ నుంచి వచ్చే మార్చి వరకు పెరిగిన ఫీజును చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీలన్నీ కలిపి సుమారు రూ. 25 కోట్ల వరకు ఈ వ్యత్యాస ఫీజు చెల్లించాల్సి ఉంది.

దీన్ని వెంటనే చెల్లించాలంటూ ఆబ్కారీ శాఖ కమిషనర్ డిమాండ్ నోటీసులు జారీచేశారు. దీనికి కొంత గడువు ఇవ్వాలని ఐఎంఎఫ్ఎల్, బీరు, ఈఎన్ఏ ఉత్పత్తిదారులు సోమవారం ఆబ్కారీ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ను కలసి విజ్ఞప్తి చేశారు. వ్యత్యాస ఫీజుకు తోడు, 2016-17 లెసైన్సు ఫీజు రూపంలో మరో రూ. 70 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అదంతా ఇప్పటికిప్పుడు కట్టడం సాధ్యం కాదని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్పత్తిదారులకు రావలసిన బిల్లులు రాలేదని, అవి వచ్చాక చెల్లిస్తామన్నారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, వ్యత్యాస ఫీజును చెల్లించాలని కమిషనర్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు