అగ్రిగోల్డ్ బాధితులకు రెండు నెలల్లో చెల్లింపులు

11 Aug, 2015 17:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: అగ్రిగోల్డ్ బాధితులకు రెండు నెలల్లోగా డిపాజిట్లకు సంబంధించిన నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు నుంచి న్యాయపరమైన సలహాలు తీసుకుని అగ్రిగోల్డ్ ఆస్తులను ‘ఈ వేలం’లో విక్రయించి వచ్చిన సొమ్మును బాధితులకు దశల వారీగా చెల్లించాలని భావిస్తోంది. ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులు నర్సింహమూర్తి, కుటుంబరావు, సీఐడీ అదనపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీబీఐ అడ్వైజర్ శరత్‌కుమార్, ఆహ్లాదరావు మంగళవారం ఉదయం విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

అనంతరం కమిటీ ఛైర్మన్ నర్సింహమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు మీడియాకు వివరాలను వెల్లడించారు. దాదాపు 32 లక్షల మంది అగ్రిగోల్డ్‌లో డిపాజిటర్లుగా ఉన్నట్లు తేలిందని, ఇందులో ఏపీలో 19 లక్షల మంది ఉన్నారని నర్సింహమూర్తి తెలిపారు. వీరందరికీ చెల్లించాల్సిన మొత్తం రూ.6800 కోట్లుగా తేలిందన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన దానికంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయని, రిజిస్టర్డ్ ఆస్తులే రూ.7 వేల కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో డిపాజిటర్లకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ‘ఈ వేలం’లో సంస్థ ఆస్తులను వేలం వేయడానికి నిర్ణయం తీసుకుందన్నారు.

>
మరిన్ని వార్తలు