వెనక్కి తగ్గిన పేటీఎం

10 Mar, 2017 10:05 IST|Sakshi
వెనక్కి తగ్గిన పేటీఎం

న్యూఢిల్లీ: మొబైల్‌ వాలెట్‌ సంస్థ పేటీఎం క్రెడిట్‌ కార్డుల వడ్డనపై వెనక్కి తగ్గింది.  క్రెడిట్‌ కార్డుతో టాప్‌ అప్‌లపై   విధించిన 2శాతం  చార్జీలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. లక్షలాది ఖాతాదారులు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  2 శాతం ఫీజును ఉపసంహరించుకుంటున్నట్టు  ఒక ప్రకటనలో వెల్లడించింది.

వినియోగదారుల సౌలభ‍్యమే  తమకు అత్యంత ముఖ్యమని, అందుకే క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై ఇటీవల  విధించిన ఫీజును రద్దు చేస్తున్నామని  పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్  ప్రకటించారు. అలాగే తమ  సేవల దుర్వినియోగాన్ని పసిగట్టేందుకు  తమ బృందాన్ని మరింత పటిష్ట పరుస్తున్నట్టు  పేర్కొన్నారు.  మరోవైపు మరో వాలెట్‌ సంస్థ మొబిక్విక్‌ తమ వాలెట్స్‌లో క్రెడిట్‌ కార్డులతో టాప్‌ అప్‌ చేస్తే ఎటువంటి చార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది.

కాగా  క్రెడిట్‌ కార్డులతో టాప్‌ అప్‌ విధానాన్ని టెక్నాలజీపై పట్టున్న కొందరు యూజర్లు నగదు రొటేషన్‌ కోసం వాడుకుంటున్నందున,  మార్చి 8నుంచి వీటిపై 2 శాతం ఫీజును వసూలు చేయనున్నట్టు ఒక బ్లాగ్‌ పోస్ట్‌లో  పేటీఎం ప్రకటించింది. నెట్‌ బ్యాంకింగ్, డెబిట్‌ కార్డ్‌ల ద్వారా టాప్‌ అప్‌లపై ఎలాంటి చార్జీలు ఉండబోవని   వివరించిన సంగతి తెలిసిందే.




 

మరిన్ని వార్తలు