కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది: పయ్యావుల కేశవ్

30 Oct, 2013 23:27 IST|Sakshi
కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది: పయ్యావుల కేశవ్

రాజ్యాంగ విభజన బిల్లును ఆమోదించవద్దు
 రాష్ట్రపతికి పయ్యావుల లేఖ


 సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన విషయంలో కేంద్రం ఏకపక్ష  ధోరణితో వ్యవహరించటం దుర్మార్గమని, విభజన బిల్లును ఆమోదించవద్దని రాష్ర్టపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీని టీడీపీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ కోరారు.రాష్ట్రపతికి రాసిన లేఖను కేశవ్ బుధవారం టీడీఎల్పీలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. శాసనసభ కోరితేనే రాష్ర్ట విభజన ప్రక్రియ ప్రారంభం కావాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా పేర్కొన్నా అందుకు పూర్తి విరుద్ధంగా కేంద్రం ప్రవర్తించటం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని లేదా గవర్నర్‌ల ద్వారా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపి అభిప్రాయాన్ని తీసుకుంటారని అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ కూడా నూతన రాష్ట్రాల ఏర్పాటు తొలి ఎస్‌ఆర్‌సీ ఆధారంగా లేదా శాసనసభ కోరితే లేదంటే విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీ లేదా కమిషన్ ద్వారా జరగాలని స్పష్టంగా పేర్కొందని తెలిపారు.

2010లో జస్టిస్ పూంఛీ కమిషన్ తన నివేదికలో ఒక మెజారిటీ గ్రూప్ లేదా ప్రాంతం విభజన కోరితే ఆ రాష్ర్ట ఆమోదం మేర కే అది  జరగాలని పేర్కొందని తెలిపారు. 2000వ సంవత్సరంలో అప్పటి  ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ పార్లమెంటులో రాష్ట్రాల విభజనపై  మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనేది శాసనసభ కోరిక మేరకు జరగాలని,  కేంద్ర ప్రభుత్వ విధానం కూడా ఇదేనని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని 2009లో అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసిన సమయంలో కూడా శాసనసభ తీర్మానం కోరతామని చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం ఒక విధానాన్ని పాటించకుండా తప్పుల తడకగా రాష్ట్ర విభజన అంశాన్ని మంత్రివర్గంలో టేబుల్ అంశంగా పెట్టి ఆమోదించిన నేపథ్యంలో విభజన బిల్లును రాష్ర్టపతి ఆమోదించటం రాజ్యాంగ విరుద్ధమౌతుందని చెప్పారు. రాజ్యాంగ సంరక్షులైన మీరు ఏడు కోట్ల మంది ప్రజలను అవమాన పరిచే, అవహేళనగురిచేసే విధంగా వ్యవహరించ రని విశ్వసిస్తున్నట్లు లేఖలో కేశవ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు