నిరశనపై వెక్కిరింపా?!

14 Oct, 2015 10:50 IST|Sakshi
నిరశనపై వెక్కిరింపా?!

సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ, రాష్ట్ర ప్రజలకు దక్కిన హక్కుల సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామిక పద్ధతిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేయడంపై ప్రజల్లో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సీఎం చంద్రబాబు ఆ పని చేయకపోగా మెతుకు ముట్టకుండా కఠోర దీక్ష సాగిస్తున్న జగన్ ఆరోగ్యంపై తప్పుడు నివేదికలతో నీచ రాజకీయాలకు దిగడంపై అన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ప్రత్యేక హోదా సాధించాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా, దానికోసం ప్రాణాలను ఫణంగా పెట్టి జగన్ సాగిస్తున్న దీక్షపై తప్పుడు నివేదికలు సృష్టించడమే కాకుండా నిస్సిగ్గుగా అవహేళన చేయడంతో..  హోదా సాధన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేస్తున్న జగన్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో చక్కెర స్థాయి ఎందుకు పెరిగిందో తెలియదంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడటం గమనిస్తే ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది.

ఏదైనా సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరశన  చేపట్టినప్పుడు ప్రభుత్వం దిగొచ్చి చర్చలు, సంప్రదింపులతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. అలాంటి ప్రక్రియను ఎప్పుడో తమ డిక్షనరీ నుంచి తొలగించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామిక నిరశనలను అపహాస్యం చేసే నీచస్థాయికి దిగజారింది. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ప్రతిపక్ష నేత నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే.. తమ కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వ వైద్యుల ద్వారా తప్పుడు నివేదికలను తయారు చేయించి చవకబారు రాజకీయానికి పాల్పడిన ఉదంతం బహుశా దేశ చరిత్రలోనే ఇప్పటివరకు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది ప్రత్యేక హోదాను అడ్డుకోవడం కాదా?
రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో పంపించారని చెప్పిన చంద్రబాబుకు.. ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తన వంతుగా ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేస్తుంటే ఎందుకు అంత ఉలుకు? రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తే... ఏమొస్తుంది? కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు.

దీక్షతో జగన్ ఆరోగ్యం క్షీణిస్తుంటే... సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాల్సిన ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా దీక్షను అవహేళన చేసే విధంగా వ్యవహరించడంలోని ఆంతర్యమేంటి? జగన్ దీక్షను ఆభాసుపాలు చేయాలనుకుంటే ఎవరికి నష్టం? ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న జగన్‌పై నిందలు వేయడమంటే.. హోదాకు అడ్డుపడటం కాదా? ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తుంటే దాన్నుంచి దృష్టి మళ్లించాలన్న దుర్బుద్ధితోనే బాబు చవకబారు ఎత్తుగడలను తెరమీదకు తెస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ప్రతి దీక్షలోనూ దక్షత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేని పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణికి నిరసనగా, విభజన తీరును నిరసిస్తూ సమైక్య రాష్ట్రం కోసం చంచల్‌గూడ జైలులో జగన్ 7 రోజులు దీక్ష చేశారు.

తనపై తప్పుడు కేసులు బనాయించిన దశలోనూ వెరవకుండా 2013 ఆగస్టు 24న నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. కనీసం నలుగురు వ్యక్తులు కూడా ఆయనను చూడడానికి వీలులేని పరిస్థితుల్లో జైలు గోడల మధ్య దీక్ష సాగించారు. కేవలం ప్రచారం కోసమే అయితే జైలు గోడల మధ్య ఎవరూ చూడలేని చోట దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం క్షీణించడంతో చివరకు 29వ తేదీ అర్ధరాత్రి జైలు అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన దీక్షను కొనసాగించారు. ఆరోగ్యం విషమించడంతో 31 వ తేదీన వైద్యులు బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కించారు.

జైలు గోడల మధ్య ఏడు రోజుల దీక్ష చేసిన జగన్ ఆ తర్వాత కూడా తన ఆరోగ్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా అక్టోబర్‌లోనే మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ లోటస్‌పాండు వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2013 అక్టోబర్ 5న దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష కొనసాగిస్తున్న దశలో ఆరోగ్యం బాగా క్షీణించి శరీరంలో కీటోన్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 9 వ తేదీ రాత్రి పోలీసులు నిమ్స్‌కు తరలించి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు మిలాఖతయిన రోజుల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ 7 రోజుల పాటు ఇందిరాపార్క్ వద్ద జగన్ కఠోర దీక్ష సాగించారు. వైద్యులు అనేక దఫాలుగా హెచ్చరించినప్పటికీ ఆయన ఆరోగ్యం విషయంలో ఏమాత్రం వెరవలేదు. 2011 ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు దీక్ష సాగించగా చివరకు పోలీసుల ద్వారా బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు