నేను దేవతను!

21 Jul, 2016 18:52 IST|Sakshi
నేను దేవతను!

న్యూఢిల్లీ: తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ పై వేటు వేయడంతో పాటు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సిందని బీఎస్పీ అధినేత్రి మాయవతి గురువారం రాజ్యసభలో వ్యాఖ్యనించారు. బీజేపీ దయాశంకర్ పై చర్యలు తీసుకుని అతన్ని పార్టీ నుంచి బహిష్కరించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తనపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించిన పార్టీలు, నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

దేశంలోని బీదవర్గాల ప్రజలు తనను దేవతగా భావిస్తారని ఆమె అన్నారు. దేవత మీద ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారని చెప్పారు. దయాశంకర్ వ్యాఖ్యలపై పార్టీ కార్యకర్తలతో తానేమీ వ్యతిరేకంగా నినాదాలు చేయమని చెప్పలేదని, దయాశంకర్ చేసిన వ్యాఖ్యల కారణంగానే దళితులు బాధపడ్డారని చెప్పారు. తనకోసం నిలబడే వారిని తాను ఆపలేనని వారి హక్కుల కోసం పోరాడతాననే హామీని మాత్రం ఇవ్వగలనని అన్నారు.

మాయావతిపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా లక్నోలో బీఎస్పీ కార్యకర్తలు దయాశంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గంటల పాటు ట్రాఫిక్ ను నిర్బంధించడంతో బీఎస్పీ కార్యకర్తలతో అధికారులు చర్చలు జరిపారు. 36 గంటల్లో దయాశంకర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వెనక్కుతగ్గారు.

బుధవారం రాత్రి తన వ్యాఖ్యలపై స్పందించిన దయాశంకర్ సింగ్ బీఎస్పీ చీఫ్ మాయావతిని ఉద్దేశించి తానే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి మాయావతి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, కానీ తన తల్లి, సోదరి, కూతురిపై ఆమె రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేవిగా ఉన్నాయని అన్నారు. దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలపై బీఎస్పీ జాతీయ సెక్రటరీ మేవలాల్ గౌతమ్ హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు