ఒడిశాలో బీజేపీ '120 మంత్రం'!

7 Sep, 2017 15:59 IST|Sakshi
ఒడిశాలో బీజేపీ '120 మంత్రం'!

సాక్షి, భువనేశ్వర్‌: ఇప్పటికే ఉత్తర భారతంలో బలంగా పాగా వేసిన బీజేపీ.. ఇక ఇప్పుడు తాము అధికారంలో లేని ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఒడిశాలో కాషాయ జెండాను రెపరెపలాడించాలని దృఢంగా భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, అధికార పార్టీ బీజూ జనతాదళ్‌ (బీజేడీ)పై దాడి ముమ్మరం చేసింది. బుధవారం భువనేశ్వర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. మూడింట రెండొంతుల మెజారిటీతో ఒడిశాలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో 120 సీట్లు గెలుచుకోవడం బీజేపీ లక్ష్యమని ప్రకటించారు.

ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలు ఉండగా.. అందులో 120 కైవసం చేసుకొని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావాలని కమలం శ్రేణులకు ఉద్భోదించారు. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై ఒడిశా ప్రజలు విశ్వాసం కోల్పోయారని, రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం ఖాయమని, ఎలాంటి పొత్తులు లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయన గురువారం ధీమా వ్యక్తం చేశారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవలి కేంద్రమంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ధర్మేంద్ర ప్రధాన్‌కు కేబినెట్‌ హోదాతో ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు