జనమంతా సంఘీభావం

29 Aug, 2013 03:53 IST|Sakshi
జనమంతా సంఘీభావం

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజనలో సమన్యాయం కోసం జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నగరం, పట్టణం, పల్లె చేయీ చేయీ కలిపి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. నాలుగురోజుల కిందట సీమాంధ్ర జిల్లాల్లో 124 మంది చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరాలు కొనసాగుతుండగా, బుధవారం ఒక్కరోజే కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2546 మంది రిలేదీక్షలు చేపట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  వినూత్న నిరసనలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, డోన్ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించివ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారంతో మూడురోజులు పూర్తి చేసుకుని గురువారానికి నాలుగోరోజు చేరింది.
 
 పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో బుధవారం నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ జిల్లాలో కడప నగరం, పులివెందుల, జమ్మలమడుగు పట్టణాల్లోని  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్‌ఆర్‌సీపీ మహిళా శ్రేణులు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశాయి. విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయానికి పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్  ఆధ్వర్యంలో తాళాలు వేశారు. గాంధీనగర్‌లోని పోస్టాఫీసుకు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త గౌతంరెడ్డి నేతృత్వంలో తాళాలు వేశారు. పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేపట్టిన నిరవధిక దీక్ష ఐదోరోజుకు చేరింది. జగన్ దీక్షకు సంఘీభావంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో   వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.  వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బుధవారం బంద్‌తో పాటు హైవేని దిగ్బంధించారు.  నెల్లూరు నగరంలో  పార్టీ సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. వైఎస్సార్ జిల్లా దువ్వూరులో జగన్ దీక్షకు మద్దతుగా డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి హైవేను దిగ్బంధనం చేసి వంటావార్పు చేపట్టారు. విశాఖ జిల్లా  ఉద్దండపురంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
 
 రాజమండ్రిలో గోదావరి సమైక్యనాదం
 జగన్ దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ‘గోదావరి సమైక్యనాదం’ పేరిట 12 మరపడవలతో గోదావరిలో యాత్ర చేపట్టారు. సమైక్య రాష్ట్ర పతాకాలు, నినాదాలతో కూడిన బ్యానర్లు పట్టుకుని పార్టీ శ్రేణులు ఈ యాత్రలో పాల్గొన్నాయి. గుంటూరు  జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో, నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోనూ మోటారు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాగా, జగన్ దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే.ఓబుళపతి బుధవారం అనంతపురంలో పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు