10 సెకన్లలో వ్యక్తిగత రుణం

19 Jun, 2015 01:57 IST|Sakshi
10 సెకన్లలో వ్యక్తిగత రుణం

తన కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ వినూత్న చొరవ
‘ఈ’ మార్గంలో రుణ మంజూరీ విధానం
 
 న్యూఢిల్లీ : కేవలం 10 సెకన్ల కాలంలో వ్యక్తిగత రుణ మంజూరు పథకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గురువారం ఆవిష్కరించింది. తన ప్రస్తుత కస్టమర్లకు ఈ పేపర్హ్రిత తక్షణ రుణ ప్రణాళికను అన్ని వేళలా అందిస్తున్నట్లు దేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేటు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

 ఎలాగంటే...
 ఈ రుణ ప్రక్రియ మొత్తం పేపర్ రహితంగా జరుగుతుంది. వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయి, ఒకేఒక్క క్లిక్ ద్వారా ఈ రుణ మంజూరు సదుపాయాన్ని పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఎటువంటి వ్యయప్రయాసలు, కాలయాపనా లేకుండా, పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. వైద్యం, తదితర అత్యవసర వ్యయాలకు ఎటువంటి నిరీక్షణా లేకుండా ఈ వ్యక్తిగత రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది.  

 ఉత్తమ సేవలు లక్ష్యంగా...
 వెర్చువల్ వాలెట్‌లో నిజమైన చెక్కు తరహా ఆవిష్కరణ ఇదని బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తో తమ కస్టమర్లకు తేలికగా వేగవంతం, పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందించడం లక్ష్యంగా ఈ రుణ సౌలభ్యతను ఆవిష్కరించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (అన్‌సెక్యూర్డ్ లోన్స్, గృహ-తనఖా రుణాల విభాగం) బిజినెస్ హెడ్ అరవింద్ కపిల్ పేర్కొన్నారు. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విధానాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు.

 డిజిటల్ మార్గంలోనే 63% లావాదేవీలు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ ‘గోడిజిటల్’ ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్లకు అందిస్తున్న మరో ఆఫర్ ‘10 సెకన్లలో వ్యక్తిగత రుణం’ పథకం. గోడిజిటల్ ప్లాట్‌ఫామ్ కింద ‘ఈ-కామర్స్’ అవసరాలకు సంబంధించి ‘పేజాప్’ అప్లికేషన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇటీవలే ఆవిష్కరించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలు అన్నింటినీ పరిశీలిస్తే... డిజిటల్ చానల్స్ వాటానే దాదాపు 63 శాతం. ఈ ఏడాది ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు