కూతుర్ని చంపిన తల్లి!

27 Aug, 2015 01:20 IST|Sakshi
ఇంద్రాణి ముఖర్జియా,షీనా బోరా. కోల్‌కతాలో సంజీవ్ ఖన్నా అరెస్ట్ దృషం

షీనా బోరా హత్య కేసులో మలుపుల మీద మలుపులు
కూతురిని సోదరిగా భర్తకు పరిచయం చేసిన భార్య
సవతి సోదరుడితో డేట్ చేసిన షీనా!
గొంతునులిమి.. సజీవ దహనం.. హత్య చేసినట్లు ఒప్పుకున్న డ్రైవర్


ముంబై: భర్తను పదిహేనేళ్లుగా బురిడీ కొట్టించిన భార్య.. కూతుర్ని సోదరిగా పరిచయం చేసిన భార్య.. ఆ కూతురితో డేట్ చేసిన సవతి కొడుకు.. ఆ కూతుర్ని హత్య చేసిన కన్న తల్లి.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..  నమ్మరాని బాంధవ్యాలు..

విస్మయం కలిగించే నిజాలు.. దేశంలోని ఓ సంపన్న కుటుంబంలో జరిగిన ఒకానొక హత్యకేసు తవ్వుతున్న కొద్దీ చిత్రవిచిత్రంగా మలుపులు తిరుగుతోంది. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని అరెస్టు చేయటంతో  ఊహకందని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పీటర్ స్టార్ ఇండియా 2002లో  స్టార్ ఇండియా సీఈఓగా ఉన్నప్పుడు  ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని ఇంద్రాణి పీటర్ దగ్గర దాచింది. చనిపోయిన షీనా సిద్ధార్థ కూతురని సమాచారం.

రెండు రోజుల క్రితం ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసేంతవరకూ ఈ విషయం పీటర్‌కు తెలియదు. ఈ నమ్మలేని అనుబంధాల కథ పీటర్ మాటల్లోనే.. ‘కలలో కూడా ఊహించని ఘటన ఇది. అదీ నా భార్య విషయంలో నాకెదురవుతుందనుకోలేదు. ఇన్నేళ్లుగా షీనాను నా భార్య ఇంద్రాణి సోదరిగానే నమ్ముతూ వచ్చాను. ఇప్పుడు షీనా.. ఇంద్రాణి కూతురని పోలీసులు చెప్పారు. అంతేకాదు. ఇంద్రాణి సోదరుడిగా నాకింతకాలం పరిచయంలో ఉన్న మిఖైల్ ఆమెకు అంతకుముందు జరిగిన పెళ్లి ద్వారా కలిగిన  బిడ్డని తెలిసి షాక్‌కు గురయ్యాను.

షీనాను ఎప్పుడూ తన సోదరిగానే ఇంద్రాణి చెప్తూ వచ్చింది. షీనా అలాగే వ్యవహరించింది. నా కొడుకు రాహుల్ ముఖర్జియా షీనాతో డేట్ చేశాడు. ఒక సందర్భంలో అతడు షీనా ఇంద్రాణి కూతురని బయటపెట్టినా నేను నమ్మలేదు. తప్పని వాదించాను. ఇంద్రాణిని అడిగాను. ఆమె తన ముందు వైఖరినే మళ్లీ చెప్పింది. ఆమెనే నమ్ముతూ వచ్చాను. మూడేళ్లుగా నా కొడుకుతో మాట్లాడటం మానేశాను. 2012 నుంచి షీనా అదృశ్యమైనా ఆ సంగతి నాకు తెలియదు. ఒకసారి నేను ఇంద్రాణిని అడిగితే ఆమె అమెరికాకు వెళ్లినట్లుగా నమ్మించింది.  షీనా లాస్‌ఏంజెలిస్ ఉన్న కొన్ని ఫోటోలను ఇంద్రాణి నాకు చూపించింది. నా కొడుకు అనుమానం వ్యక్తం చేశాడు’’
 
రాయ్‌గఢ్ అడవుల్లో షీనా హత్య
షీనాబోరాను రాయ్‌గఢ్ జిల్లాలోని అడవుల్లో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 2012 ఏప్రిల్ 24న షీనాను గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి దహనం చేశారని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు. మే 23న పోలీసులకు మృతదేహం దొరికిందని, అయితే గుర్తు తెలియని మృతదేహం కావటంతో.. డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించకుండానే దానికి అంత్యక్రియలు నిర్వహించారని మారియా వివరించారు.

విచారణ సందర్భంలో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్లు, మృతదేహాన్ని అడవుల్లో కాల్చేందుకు తాను సహకరించినట్లు ఇంద్రాణి డ్రైవర్ ఒప్పుకున్నట్లు  చెప్పారు. ఈ హత్య కేసులో ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా నిందితుడన్నారు.  ఖన్నాను కోల్‌కతాలోని అతని స్నేహితుడి ఫ్లాట్‌లో అరెస్టు చేసి ముంబైకి తీసుకువచ్చారు. అయితే హత్యకు నిజమైన కారణాలేమిటన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఇంద్రాణిని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఆమె పోలీస్ కస్టడీని న్యాయమూర్తి ఈ నెల 31 వరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు