పెరిగిన పెట్రో ధరలు

1 Mar, 2014 00:23 IST|Sakshi
పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. పెట్రోల్ ధర లీటరుకు 60 పైసలు, డీజిల్ ధర 50 పైసలు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన ఈ పెంపునకు స్థానిక పన్నులు జతకానుండడంతో ప్రాంతాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. పెట్రోల్ ధర ఈ ఏడాదిలో పెరగడం ఇది రెండో సారి. జనవరి 4న దీనిపై 91 పైసలు వడ్డించారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర 73 పైసలు పెరిగి రూ.73.16కు చేరింది. హైదరాబాద్‌లో రూ.79.11గా ఉన్న పెట్రోల్ ధర 79.90కి పెరిగింది. ఢిల్లీలో డీజిల్ 57 పైసలు పెరిగి రూ. 55.48కి చేరుకుంది. హైదరాబాద్‌లో రూ.59.83 నుంచి 60.44కి పెరిగింది.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 116.04 డాలర్ల నుంచి 118.1 డాలర్లకు పెరగడం, రూపాయి మారకం విలువ 62.02 నుంచి 62.12కు తగ్గడం వల్లే పెట్రోల్ రేటు పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. డీజిల్ అమ్మకాలపై నష్టాల భర్తీకి ప్రతినెలా 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఉండడంతో దాని ధరను పెంచామని పేర్కొంది. ఇంకా డీజిల్‌పై లీటరుకు రూ.8.37 నష్టం వస్తోందని వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు