మధ్యప్రదేశ్లో మరో బియాస్ దుర్ఘటన

5 Aug, 2014 15:40 IST|Sakshi
మధ్యప్రదేశ్లో మరో బియాస్ దుర్ఘటన

బియాస్‌ నదీ విషాదాన్ని మరువక ముందే అలాంటి ఘటనే పునరావృతమైంది. మధ్యప్రదేశ్‌ జబల్పూర్‌లోని బాగ్దారి జలపాతం వద్ద 11 మంది నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన అధికారులు ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మధ్యప్రదేశ్‌లోని హన్‌మాన్‌తల్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు సరదాగా గడపాలనుకున్నాయి. ఎంజాయ్ చేసేందుకు జబల్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నబాగ్దారి జలపాతాన్ని ఎంపిక చేసుకున్నాయి. అనుకున్నట్లుగానే రెండు కుటుంబాలకు చెందిన 12 మంది బాగ్దారి జలపాతానికి వెళ్లారు. కొండల మధ్య చిన్న నదీపాయను దాటి పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు. జలపాతం అందాలను ఆస్వాదించి సంతోషంగా గడిపారు.

సరిగ్గా వాళ్లు తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో మృత్యువు కాటేసింది. నదీపాయను దాటుతున్న సమయంలో అనూహ్యంగా పెరిగిపోయిన వరద ఆ రెండు కుటుంబాలను కబళించేసింది. వరద ఉద్ధృతిలో మొదట ఓ యువకుడు పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారంతా కొట్టుకుపోయారు. ఒక యువతి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. మరో యువతిని రక్షించేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నించినా అది ఫలించలేదు. ప్రమాద విషయం తెలిసిన అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సహాయ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.

ఈ గాలింపులో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతోంది. ఈ ఘోర విషాదంలో ప్రాణాలతో బయటపడిన యువతికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులకు  లక్ష రూపాయల చొప్పున జిల్లా అధికార యంత్రాంగం ఎక్స్గ్‌గ్రేషియా ప్రకటించింది. వాస్తవానికి వాళ్లు ఉన్నప్పుడు ప్రవాహం అంత ఎక్కువగా లేదని, కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉన్నట్టుండి ప్రవాహం ఎక్కువయ్యిందని, దాన్ని గుర్తించి అవతలి గట్టుకు వెళ్దామనుకునేలోపే ప్రవాహం ముంచుకొచ్చి 11 మంది నీళ్లలో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు