సమయస్ఫూర్తి... ప్రాణాలు కాపాడింది!

29 Sep, 2015 12:47 IST|Sakshi
సమయస్ఫూర్తి... ప్రాణాలు కాపాడింది!

న్యూయార్క్: వైద్యో నారాయణ హరి అన్న నానుడికి సార్థకత చేకూర్చాడో ఎన్నారై వైద్యుడు. సమయస్ఫూర్తితో రెండేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడాడు. సెప్టెంబర్ 18న స్పెయిన్ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆస్తమాతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇన్ హేలర్ చెక్డ్ లాగేజీలో ఉండిపోవడంతో ఏం చేయాలో తల్లిదండ్రులకు పాలుపోలేదు. అదే విమానంలో ఉన్న డాక్టర్ ఖుర్షిద్ గురు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడు ప్రాణాలు కాపాడారు. వాటర్ బాటిల్, కప్పుతో అప్పటికప్పుడు ఇన్ హేలర్ తయారుచేసి బాలుడికి శ్వాస  అందించారు. విమానంలో ఇన్ హేలర్ ఉన్నప్పటికీ అది పెద్దవాళ్లకు మాత్రమే పనికొస్తుంది.

ఈ విషయం గ్రహించిన డాక్టర్ ఖుర్షిద్.. వాటర్ బాటిల్ ను ఒకవైపు కత్తిరించారు. మరోవైపు చిన్న రంధ్రం చేసి ఇన్ హేలర్ లోని ఆక్సిజన్ ను బాటిల్ లోకి ఎక్కించారు. దీన్ని బాలుడికి అందించారు. కత్తిరించిన భాగం నుంచి బాలుడికి ఆక్సిజన్ అందించారు. దాదాపు అరగంటపాటు ఈ ప్రక్రియ కొనసాగించి చిన్నారికి ఉపశమనం కలిగించారు.

సమయస్ఫూర్తితో బాలుడిని కాపాడిన డాక్టర్ ఖుర్షిద్ ను అందరూ ప్రశంసించారు. జమ్మూకశ్మీర్ కు చెందిన డాక్టర్ ఖుర్షిద్.. న్యూయార్క్ లోని రాస్ వెల్ పార్క్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రొబొటిక్ సర్జరీ విభాగంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు