వదిలేసినా.. వెతుక్కుంటూ వస్తుంది

8 Feb, 2017 04:31 IST|Sakshi
వదిలేసినా.. వెతుక్కుంటూ వస్తుంది

‘‘నిను వీడని నీడను నేనే...’’ అని పాత తెలుగు సినిమా పాట ఒకటి ఉంది లెండి. పక్క ఫొటోలో కనిపిస్తున్న నీలం రంగు డబ్బీ కూడా అదే టైపు! మీరెక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తుంది. పరుగులు పెట్టారా? నో ప్రాబ్లెమ్‌.. గంటకు 22 మైళ్ల వేగంతో మీ వెంటే పరుగులు పెట్టేస్తుంది. బాగానే ఉందిగానీ... నాకేంటి? అంటున్నారా? ఓ మాల్‌లో ఇలాంటిది మీ తోడుగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి? ఈ నీలం డబ్బీనే... తెల్లారుతూనే మీ కుక్కపిల్లను అలా అలా వ్యాహ్యాళికి తీసుకెళ్లిందనుకోండి ఏమవుతుంది? మీ శ్రీమతి వంటింట్లో బిజీగా ఉన్నప్పుడు  పక్కింటి బామ్మ గారు అరువుగా అడిగే కప్పు కాఫీపౌడర్‌ను ఇదే ఇచ్చి వస్తే బావుండదా? అబ్బో ఎన్ని ప్రయోజనాలో దీంతో..!!! మరి.. దీని వివరాలేమిటంటే... మన వెస్పా స్కూటర్‌ ఉంది కదా.. దాన్ని తయారు చేసిన పియాజియో కంపెనీనే దీన్నీ అభివృద్ధి చేసింది.

పేరు  గీతా (ఇటాలియన్‌ భాషలో చిన్న ట్రిప్‌ అని అర్థమట) రెండు అడుగుల ఎత్తు దాదాపు 40 కిలోల బరువు ఉండే ఈ సూపర్‌ రోబో 20 కిలోల బరువు కూడా మోయగలదు. కెమెరాలు, సెన్సర్లు అనేకమున్న ఈ రోబో యజమాని వెంట దొర్లుకుంటూ రాగలదు.. కొన్ని సార్లు దీనికి దారి చూపిన తరువాత దానంతట దాన్ని వదిలేసినా సరే... దారి వెతుక్కుని ఇంటికి వచ్చేయగలదు కూడా. కృత్రిమ మేధతో పనిచేసే ఈ రోబోను ఇటీవలే అమెరికాలోని బోస్టన్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతానికి తాము దీన్ని సూపర్‌ మార్కెట్ల నుంచి ఇళ్లకు సరుకులు మోసుకొచ్చే రోబోగా చూడటం లేదని, మెకానిక్‌ల వెంట పరికరాలు మోసుకెళ్లే యంత్రంగా ఎక్కువ ఉపయోగకరమని భావిస్తున్నట్లు పియాజియో ప్రతినిధి అంటున్నారు. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ బుల్లి రోబో ధరవరలు మాత్రం తెలియాల్సి ఉంది. మోటార్‌సైకిల్‌ కంటే ఎక్కువ.. కారు కంటే తక్కువ ధర ఉంటుందని మాత్రమే కంపెనీ చెబుతోంది!
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు