త్వరలో మలేసియా విమానంపై నివేదిక

25 Apr, 2014 11:48 IST|Sakshi
త్వరలో మలేసియా విమానంపై నివేదిక

అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్ 370 ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రాధమిక నివేదిక వచ్చే వారం విడుదల చేస్తామని దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన గల్లంతుపై నివేదికను ఇప్పటికే ఇంటర్నేషనల్ సివిల్ ఎవియేషన్ అర్గనైజేషన్ (ఐసీఏఓ)కు పంపినట్లు చెప్పారు. ఐసీఏఓ నుంచి రాగానే ఆ నివేదికను విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

అదృశ్యమైన విమానం ఆచూకీ కనుగొనడంలో పూర్తిగా విఫలమైందని గల్లంతైన విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాధమిక నివేదికను వచ్చే వారం విడుదల చేస్తామని నజీబ్ రజాక్ వెల్లడించారు. 239 మందితో గత నెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే విమానం విమానాశ్రయంతో సంబంధాలు తెగిపోయాయి. నాటి నుంచి విమానం కోసం పలు దేశాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది.

దాంతో విమానంలో ప్రయాణిస్తున్న తమ బంధులువు ఏమైయ్యారో తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనను తీవ్రతరం చేసి ప్రభుత్వం చేతకాని తనం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు సంధించారు. దాంతో విమానం గల్లంతుపై మలేసియా ప్రభుత్వం ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక అందజేయాని ఆదేశించింది. దీంతో మలేసియా విమానం గల్లంతుపై ప్రాధమిక నివేదిక ప్రజల చేతులలోకి రానుంది.

మరిన్ని వార్తలు