మోదీ-ట్రంప్‌ భేటీ; ప్లాన్‌ ఛేంజ్‌

26 Jun, 2017 17:02 IST|Sakshi
మోదీ-ట్రంప్‌ భేటీ; ప్లాన్‌ ఛేంజ్‌

వాషింగ్టన్‌: ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోన్న భేటీ మరికొద్ది గంటల్లో జరగనుంది. భారతప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 1:20గంటలకు) మొదలయ్యే భేటీలో తొలి 20 నిమిషాలు.. ఇరుదేశాధినేతలు ఏకాంత చర్చలు జరుపుతారు. వాణిజ్యం, వీసాలు, పర్యావరణ మార్పులు తదితర కీలక అంశాలపై వీరు మాట్లాడుకోనున్నారు.

అనంతరం తమతమ దేశాల ప్రతినిధులతో కలిసి సమావేశమవుతారు. సాయంత్రం 5:10 నిమిషాలకు మోదీ, ట్రంప్‌లు తమ భేటీపై సంయుక్త ప్రకటన చేస్తారు. 6 గంటలకు మోదీ గౌరవార్ధం ట్రంప్‌ అధికారిక విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వైట్‌హౌస్‌ అధికారులు పూర్తిచేశారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్‌లో చిన్నపాటి మార్పులు చేశారు.

ప్లాన్‌ ఛేంజ్‌..
మోదీ, ట్రంప్‌ల జాయింట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ప్లాన్‌లో మార్పులు చేశారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం.. ఇరు దేశాధినేతలు తమ తమ సందేశాలు చెప్పేసి వెళ్లిపోతారు. విలేకరులు ప్రశ్నలు అడిగే వీలులేదు. కానీ ఆఖరినిమిషంలో ప్లాన్‌ ఛేంజ్‌ చేశారు. మోదీ, ట్రంప్‌లిద్దరూ చెరొక ప్రశ్నకు సమాధానం చెబుతారని వైట్‌హౌస్‌ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఆ ప్రశ్న ముందుగానే ఎంపికచేసినది(ప్రీ సెలెక్టెడ్‌) కావడం గమనార్హం.

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రత్యేక వ్యాసం రాసిన మోదీ
తన అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రఖ్యాత ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’  పత్రికలో ప్రత్యేక వ్యాసం రాశారు. గత ఏడాది సరిగ్గా ఇదే జూన్‌లో(ఒబామా హయాంలో) తాను అమెరికన్‌ కాంగ్రెస్‌లో మాట్లాడిన మాట(చరిత్ర పొడవునా భారత్‌, అమెరికాలు ఎన్నెన్నో అవరోధాలు దాటుకుంటూ వచ్చాయి)లను మోదీ గుర్తుచేశారు. ఇప్పుడుకూడా ఇరుదేశాలు తమతమ ప్రయోజనాలు, విలువల కోసం ఏకోన్ముఖంగా మెలగాల్సిన అవసరం ఉందని మోదీ తన వ్యాసంలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు