ఆ డబ్బంతా మీదే: మోదీ సంచలన ప్రకటన

3 Dec, 2016 16:16 IST|Sakshi
ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను!

మొరాబాద్‌: ‘నాకు హైకమాండ్‌ లేదు. ప్రజలే నా హైకమాండ్‌. వారే నాకు ముఖ్యం. వారికే నేను నివేదిస్తాను’  అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లో శనివారం జరిగిన పరివర్తన్‌ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెద్దనోట్ల రద్దుపై భావోద్వేగంగా మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తన నేరమా? అవినీతి అంతానికి పోరాడినవాడు నేరస్తుడు అవుతాడా? అని ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తనను నిందిస్తుండటం చూసి ఆశ్చర్యం కలుగుతోందని, పేదల కోసం పనిచేయడమే తాను చేసిన తప్పా? అని ఆయన అన్నారు.
 

ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను!
‘నేను మీ కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నాను. ఆ అవినీతిపరులు నన్నేమీ చేయగలరు? మహా అయితే ఏం చేస్తారు? నేను ఫకీర్‌ను. జోలె సర్దుకొని ఏ క్షణమైన వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని, పెదలను పొగుడుతూ.. మీ జన్‌ధన్‌ ఖాతాల్లో రూ. 2-3 లక్షలు వేసుకోమని బతిమిలాడుతున్నారని అన్నారు. శక్తిమంతులు, నిజాయితీపరులు ఇప్పుడు బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారని, ధనికులు మాత్రం రహస్యంగా పేదల ఇళ్ల ముందు క్యూలు కట్టి వారి జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బులు వేసుకోమని వేడుకుంటున్నారని అన్నారు.

‘ఎవరి డబ్బు అయినా మీ ఖాతాల్లో వేసుకుంటే.. అందులో ఒక్క పైసా కూడా విత్‌డ్రా చేయకండి. వాళ్లు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడతారు. మిమ్మల్ని వేడుకుంటారు. మీ కాళ్ల మీద పడతారు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తే.. నేను ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ధైర్యంగా చెప్పండి. మీ ఖాతాల్లో చేరిన నల్లధనాన్ని విత్‌డ్రా చేయబోమని హామీ ఇవ్వండి. అలా చేస్తే మీ ఖాతాల్లో డబ్బు వేసిన వారిని జైలుకు పంపించి.. ఆ డబ్బు మీ ఇంటికి చేరే మార్గాన్ని నేను కనిపెడతాను’ అని మోదీ స్పష్టం చేశారు. మీ జన్‌ధన్‌ ఖాతాలోని డబ్బులు వాపస్‌ ఇవ్వాలని ధనికులు అడిగితే.. ఎదురు ప్రశ్నించాలని, ఆధారాలు అడుగాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ డబ్బు అంతా పేదలకే చెందేలా చేస్తానని హామీ ఇచ్చారు. కాలం మారిందని, కాలంతోపాటు మనమూ మారాలని సూచించారు. మొబైల్‌ఫోన్‌లోకే బ్యాంకు వచ్చేసిందని, మొబైల్‌ ఫోన్‌ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చునని చెప్పారు.