వాజ్పేయి చేయనిది మోదీ చేశారు

30 Sep, 2016 09:30 IST|Sakshi
వాజ్పేయి చేయనిది మోదీ చేశారు

పాకిస్థాన్ భూభాగంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లో దాడులు చేస్తూ దేశ భద్రతకు సవాల్ విసురుతున్నారు. పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు ఉసిగొల్పుతోంది. 2011లో అటల్ బిహారి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉగ్రవాదులు సాక్షాత్తూ పార్లమెంట్పైనే దాడి చేశారు. అంతకుముందు, ఆ తర్వాత కూడా పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దేశంలో పలు చోట్ల దాడులు చేశారు. వాజ్పేయి హయాంలో పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు. అలాగే కార్గిల్ యుద్ధంలో విజయం సాధించారు. కానీ పార్లమెంట్పై ఉగ్రదాడి అనంతరం వాజ్పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. నాడు అటల్ చేయలేనిది, నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపించారు. ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడికి మోదీ పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పారు. దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి సైన్యానికి అనుమతిచ్చారు. భారత సైన్యం 40 మంది ఉగ్రవాదులను హతమార్చి, మరికొందరిని బందీలుగా పట్టుకుంది. తద్వారా ఉగ్రవాదాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని, దీటైన సమాధానం చెబుతామంటూ మోదీ ప్రభుత్వం పాక్కు వార్నింగ్ ఇచ్చింది.

ఉడీ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి పాకిస్థాన్ను ఏకాకిని చేయడంలో సఫలమయ్యారు. ఇక దక్షిణాసియా దేశాలు భారత్కు అండగా నిలిచి.. పాక్లో జరగాల్సిన సార్క్ సదస్సును బహిష్కరించాయి. ప్రపంచ దేశాల నుంచి పాక్కు ఆర్థికంగా, సైనికపరంగా సాయం అందకుండా చేసి, బలహీనపరచడానికి మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఉడీ దాడిని మరచిపోమని చెప్పిన ప్రధాని మోదీ కేరళలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశం వేదిక నుంచి పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక చేస్తారని భావించారు. అయితే దేశ ప్రజలు, మీడియా ఊహించిన స్థాయిలో మోదీ స్పందించలేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో గాక పేదరికాన్ని నిర్మూలించడంలో, అభివృద్ధి సాధించడంలో పోటీ పడాల్సిందిగా పాక్కు సూచించారు. ఉడీ ఉగ్రదాడికి బదులు చెప్పడానికి మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మోదీ మాటలతో గాక చేతలతో చూపించారు. దేశ ప్రజలు ఊహించిన దానికంటే మోదీ అసాధారణ నిర్ణయం తీసుకుని పాక్కు గట్టి జవాబు చెప్పారు.

మరిన్ని వార్తలు