‘బాహుబలి వంతెన’పై మోదీ హల్‌చల్‌

26 May, 2017 12:37 IST|Sakshi
‘బాహుబలి వంతెన’పై మోదీ హల్‌చల్‌

- దేశంలోనే అత్యంత పొడవైన ‘ధోలా-సదియా’ వారధిని జాతికి అంకితం చేసిన ప్రధాని
- ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి వంతెనపై ఒంటరిగా నడక


పురానా సదియా:
భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ప్రసిద్ధిగాంచిన ‘ధోలా సదియా’ వారధిని శుక్రవారం జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘వంతెనల్లో బాహుబలి’గా అభివర్ణిస్తోన్న ధోలా- సదియా వారధిని.. అసోం, అరుణాచాల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ, బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన లోహిత నదిపై 9.15 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.

ప్రత్యేక విమానంలో అసోంలోని దిబ్రూఘర్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి కారులో టిన్‌సుకియా జిల్లా పురానా సదియా వద్దకు చేరుకున్నారు. వంతెన ప్రారంభోత్సవం నిమిత్తం ఏర్పాటుచేసిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని.. అనంతరం రిబ్బన్‌ కట్‌చేసి వంతెనను జాతికి అంకితం చేశారు. అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీతోపాటు పలువురు నాయకులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రోటోకాల్‌ పక్కనపెట్టి సింగిల్‌గా..
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన సందర్భంలోనే ప్రధాని మోదీ ఈ భారీ వంతెనను ప్రారంభించడం గమనార్హం. వంతెనను ప్రారంభించిన అనంతరం దానిపై మొదటిగా ప్రధాని కాన్వాయ్‌ ప్రయాణించింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత కాన్వాయ్‌ని ఆపేయించిన మోదీ.. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఒంటరిగా వంతెనపై నడిచారు. దాదాపు 200 మీటర్ల దూరం సింగిల్‌గా నడిచివెళ్లిన ఆయన.. వంతెనపై అటు,ఇటు కలియతిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఆ తర్వాత సోనోవాల్‌, గడ్కరీలను దగ్గరికి పిలిచి వారితో సంభాషించారు. అలా పదినిమిషాల పాటు వంతెనపై గడిపిన మోదీ.. బహిరంగ సభలో పాల్గొనేందుకు ధోనీ వైపునకు కదిలారు.


కట్టింది తెలుగువారి కంపెనీయే!
‘వంతెనల్లో బాహుబలి’గా పేరుగాంచిన ‘ధోలా-సదియా’వారధి నిర్మాణంలో తెలుగువారి ప్రమేయం ఉండటం విశేషం. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించిందించి మరెవరోకాదు, హైదరాబాద్‌, వైజాగ్‌లు ప్రధాన కేంద్రాలుగా పనిచేసే ప్రఖ్యాత నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌! దీని వ్యవస్థాపకులు తెలుగువారేకావడం, గోదావరి నదిపైనా ఈ సంస్థ పలు వంతెనలు నిర్మించడం తెలిసిందే. యూపీఏ సర్కార్‌ హయాంలో(2011లో) శంకుస్థాపన జరుపుకున్న ‘ధోలా-సదియా’ వంతెన నిర్మాణానికి ఆరేళ్ల సమయం పట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ బ్రిడ్జిని కట్టారు.


బద్దలుకానున్న భారీ రికార్డు..
దేశంలోనే అతిపొడవైన(9.15 కిలోమీటర్ల) వంతెనగా నేడు ప్రారంభోత్సవం జరుపుకున్న ‘ధోలా- సరియా’ రికార్డు ఎంతోకాలం నిలబడదు. ఎందుకంటే త్వరలోనే గంగా నదిపై 9.8 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించబోతున్నారు. బిహార్‌లోని పట్నా- హాజీపూర్‌లను కలుపుతూ గంగా నదిపై ప్రస్తుతం ఉన్న ‘మహాత్మాగాంధీ వారధి’ స్థానంలో కొత్త(9.8 కి.మీ) వంతెనను కట్టబోతున్నారు. ప్రస్తుతానికి మన దేశంలోని (నదిపై నిర్మించిన) రెండో అతిపెద్ద వంతెనగా మహాత్మాగాంధీ వారధి(5.7కి.మీ) కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వురు-రాజమహేంద్రవరం బ్రిడ్జి(4.1 .కి.మీ.) దేశంలోని పొడవైన వంతెనల్లో 8వ స్థానంలో ఉంది.

ధోలా- సదియాకు సంబంధించిన మరిన్ని విశేషాలు..

  • సధియా ప్రాంతం అసోం రాజధాని గువాహటి నుంచి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక, ధోలా.. అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుంచి 300 కి.మీ.ల దూరంలో ఉంది.
  • ఈ వంతెనతో అసోం- అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల మధ్య ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోనుంది.
  • 2011లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. వంతెన కోసం రూ. 950 కోట్లు వెచ్చించారు.
  • ఈ వంతెన సైనికపరంగా కూడా చాలా కీలకమైనది. అరుణాచల్ ప్రదేశ్‌లోకి భద్రతా బలగాలు సులువుగా ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. చైనా సరిహద్దుల్లోకి సులువుగా వేగంగా వెళ్లడానికి వంతెన తోడ్పడుతుంది.
  • యుద్ధ ట్యాంకులు కూడా వెళ్లడానికి సౌకర్యంగా ఈ వంతెనను నిర్మించారు.

 

మరిన్ని వార్తలు