ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు!

19 Sep, 2015 01:47 IST|Sakshi
ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు!

ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సహించేది లేదు
* ఐరాస 70వ వార్షిక కార్యక్రమం అందించే సందేశం అదే కావాలి
* భద్రతామండలిలో సంస్కరణల అమలుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి
* ఐరాస చీఫ్ బాన్ కి మూన్‌కు రాసిన లేఖలో మోదీ
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి చరిత్రాత్మక 70 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా.. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న స్పష్టమైన, కఠిన సందేశాన్ని పంపించాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని, నిర్దిష్ట కాలపరిమితితో సంస్కరణలు అమలు చేయాలని కోరారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌కు మోదీ జాలై 4న పంపిన లేఖను ఐరాసలో భారత శాశ్వత ప్రాతినిధ్య మిషన్ గురువారం మీడియాకు విడుదల చేసింది. మారుతున్న కాలంతో పాటు భద్రతాపరంగా ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ఐరాస రూపుదిద్దుకోవాల్సి ఉందని లేఖలో మోదీ అన్నారు.

పాక్ నుంచి భారత్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యను నర్మగర్భంగా ప్రస్తావిస్తూ.. ‘రెండో ప్రపంచయుద్ధం తరువాత రాజ్యాల మధ్య విభేదాల నేపథ్యంలో ఐరాస ఆవిర్భవించింది. కానీ ప్రస్తుతం రాజ్యేతర సాయుధ శక్తులే కీలకంగా మారిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రూపొందించిన సమగ్ర ఒప్పందం ఈ సంవత్సరమే అమల్లోకి రావాల్సి ఉంది’ అని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో  సెప్టెంబర్ 25న జరగనున్న ‘సంతులిత అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు’నుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
 
మోదీ  లేఖలోని ఇతర ముఖ్యాంశాలు..
* ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం గతంలో దేశాలను సవాలు చేసేంత తీవ్రంగా ఉండేవి కాదు. కానీ అపరిమిత వనరులు, సైద్ధాంతిక వ్యాప్తికి ఉపయోగపడే సరికొత్త సాధనాలతో అవి భౌగోళికంగా, సంఖ్యాపరంగా బాగా విస్తృతి చెందాయి. అందువల్ల ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమగ్ర ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందం అత్యవసరంగా అమల్లోకి తీసుకురావాలి. అందుకు ఐరాస 70 వ వార్షికోత్సవం వేదిక కావాలి.
* 2015 అనంతర అభివృద్ధి ఎజెండా సమర్ధవంతంగా అమలవాలంటే.. ఐరాసలో ముఖ్యంగా భద్రతామండలిలో సంస్కరణలు అత్యావశ్యకం. అది ప్రస్తుతం మన ముందున్న అత్యంత ముఖ్యమైన, సత్వరం చేయాల్సిన, కష్టమైన బాధ్యత. గతకాలంనాటి పరిస్థితుల ఆధారంగా భద్రతామండలి ఏర్పడింది. నిజానికి 21వ శతాబ్ద వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా ప్రస్తుత భద్రతామండలి ఉండాలి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి, ప్రపంచంలోని అన్ని ఖండాలకు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు అందులో ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే దాని విశ్వసనీయత పెరుగుతుంది.
* శాంతిభద్రతలు, మానవహక్కులు, అభివృద్ధి.. ఐరాస ప్రాథమిక పునాదులైన  అంశాల్లో భవిష్యత్‌కు అనుగుణంగా ఆలోచనాతీరు మార్చుకోవాల్సి ఉంది.
* అంతర్జాతీయ సమాజం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐరాస సంసిద్ధంగా ఉందా? సంప్రదాయ ఐరాస శాంతి పరిరక్షణ దళాలు అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆధునిక భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో సువ్యవస్థీకృతమయ్యాయా? అని ప్రశ్నించుకోవాల్సి ఉంది.
* శాంతి పరిరక్షక దళాల్లో కీలకపాత్ర పోషిస్తున్న దేశాలకు భద్రతామండలిలో మరింత ప్రాతినిధ్యం కల్పించాలి. (ఐరాస శాంతిపరిరక్షణ దళాల్లో భారత్ నుంచి 1.8 లక్షల మంది సైనికులున్నారు. ఇప్పటివరకు వివిధ దేశాల్లో జరిగిన 44 శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారత దళాలు పాల్గొన్నాయి)
* 2013 నాటికి పేదరికాన్ని సంపూర్ణంగా అంతం చేయడం ‘ఐరాస, 2015 అనంతర అభివృద్ధి ఎజెండా’ లక్ష్యం కావాలి. ఆ దిశగా భారత ప్రభుత్వం అందరితో కలిసి.. అందరి అభివృద్ధి’ నినాదంతో ముందుకు వెళ్తోంది.
* వాతావరణ మార్పు సవాలును అధిగమించేందుకు ఇప్పటికే పెట్టుకున్న లక్ష్యాలు మించిన ఫలితాలు చూపాలి. అందుకు అభివృద్ధి చెందిన దేశాలు చొరవ చూపాలి.
 
23న అమెరికాకు మోదీ
ఐరాస చీఫ్ బాన్ కి మూన్ ఆధ్వర్యంలో, ఐరాస ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 25న జరగనున్న సంతులిత అభివృద్ధిపై సదస్సునుద్దేశించి  ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకుగాను సెప్టెంబర్ 23న ఆయన అమెరికా చేరుకుంటారు. సదస్సులో 150కి పైగా దేశాల అధినేతలు పాల్గొననున్నారు.

సెప్టెంబర్ 25నే ఆ సదస్సునుద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగిస్తారు. 26, 27 తేదీల్లో మోదీ శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. 28న న్యూయార్క్ చేరుకుంటారు. ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చలు జరిపే అవకాశముంది. అదేరోజు ఐరాస శాంతి పరిరక్షక దళాల రెండో సదస్సునుద్దేశించీ మోదీ ప్రసంగిస్తారు. ఐరాస సర్వప్రతినిధి సభలో అక్టోబర్ 1న భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగిస్తారు.

మరిన్ని వార్తలు