రోహింగ్యా మహావలస: సూకీతో మోదీ భేటీ!

6 Sep, 2017 11:18 IST|Sakshi
ఆంగ్‌ సాన్‌ సూకీతో ప్రధాని మోదీ భేటీ!

నేపిథా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం మయన్మార్‌ ప్రభుత్వ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌ సూకీతో భేటీ అయ్యారు. భారత్‌-మయన్మార్‌ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 'విలువైన స్నేహితుడితో భేటీ కొనసాగుతోంది. సూకీతో మోదీ భేటీ అయ్యారు' అని భారత విదేశాంగశా అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ట్వీట్ చేశారు.

రఖినె రాష్ట్రంలోని రోహింగ్యా తెగ ముస్లింల మహావలస కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మయన్మార్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మయన్మార్‌లో మెజారిటీ ప్రజలైన బౌద్ధులు రోహింగ్యాలపై హింసాత్మక దాడులకు దిగుతున్న నేపథ్యంలో రోహింగ్యాలు ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు పెద్ద  ఎత్తున వలస వెళ్తున్నారు.

సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ రోహింగ్యాల వలస అంశాన్ని లేవనెత్తే అవకాశముందని భావిస్తున్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున సాగుతున్న రోహింగ్యాల వలసలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40వేల మంది రోహింగ్యాలను స్వదేశానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు మయన్మార్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మయన్మార్‌ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. భారత్‌ను సందర్శించాలనుకునే మయన్మార్‌ వాసులకు ఉచితంగా వీసాలు ఇస్తామని తెలిపారు. భారత్‌లోని జైళ్లలో మగ్గుతున్న 40 మంది మయన్మార్‌ పౌరులను విడుదల చేస్తామని ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు