జింగ్‌పింగ్‌తో మోదీ మంతనాలు.. పాక్‌పై చర్చ!

15 Oct, 2016 19:14 IST|Sakshi
జింగ్‌పింగ్‌తో మోదీ మంతనాలు.. పాక్‌పై చర్చ!

గోవా: బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు గ్జి జింగ్‌పింగ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అనంతరం జింగ్‌పింగ్‌ను మోదీ కలుసుకున్నారు. ఇటీవలికాలంలో వరుస ఉగ్రవాద దాడులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నా..  చైనా బహాటంగా పాకిస్థాన్‌కు మద్దతునిస్తోంది. అంతేకాకుండా పాకిస్థానీ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానానికి ఐరాసలో మోకాలడ్డింది.

ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించవచ్చునని భావిస్తున్నారు. అణుసరఫరా దారుల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ స్వభ్యత్వం అంశంపైనా జింగ్‌పింగ్‌తో మోదీ చర్చలు జరిపే అవకాశముంది. ఇరుదేశాల దౌత్య సంబంధాలు, పాకిస్థాన్‌ ఉగ్రవాద దాడులపై ఇద్దరు నేతలు ముఖాముఖి మాట్లాడుకోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

గోవాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ అధ్యక్షతన రెండురోజులు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రే ప్రధాని నరేంద్రమోదీ గోవా వచ్చారు. బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో శనివారం పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌, రష్యా 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగంలో ఒప్పందాలు చేసుకున్నాయి. నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైళ్లపై రష్యాతో భారత్‌ ఒప్పందం చేసుకుంది.

మరిన్ని వార్తలు