బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ హెచ్చరిక

31 Dec, 2016 20:08 IST|Sakshi
బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. అక్రమార్కులను వదిలిపెట్టేదిలేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవచేయడానికేనని గుర్తుచేశారు.

'ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో బ్యాంకులకు నగదు చేరలేదు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు అధికారులు అవినీతి పాల్పడ్డారు. ఇప్పుడు బ్యాంకులు ఏం చెయ్యాలంటే.. పోగైన డబ్బునంతా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు వినియోగించే ప్రయత్నం చేయాలి. ఉన్నత లక్ష్యంతో చేసే పనుల్లో లాభం కొద్దిపాటిదే అయినా దీర్ఘకాలికంగా దేశానికి మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. నోట్ల రద్దు తర్వాత చాలా మంది బ్యాంకు, పోస్ట్‌ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన తప్పులు చేశారు. వారిని వదిలిపెట్టేది లేదు. కఠినంగా శిక్షిస్తాం'అని మోదీ అన్నారు.

దేశంలో అమలవుతోన్న ఆర్థిక విధానంలో ఎన్నో లోపాలున్నాయన్న ప్రధాని.. నగదు ఎక్కువగా చెలమణిలో ఉండటం వల్ల నిత్యావసరాల ధరలు, అవినీతి, నల్లధనమూ పెరిగాయని పేర్కొన్నారు. నగదు రహిత విధానంతో ఈ సమస్యలన్నీ రూపుమాసిపోతాయని, లాల్‌బహదూర్‌ శాస్త్రి, కామరాజ్ నాడార్‌‌, జయప్రకాశ్‌ నారాయన్‌ వంటి మహానేతలు ఉండుంటే ఈ నిర్ణయాన్ని పరిపూర్ణంగా సమర్థించేవారని అభిప్రాయపడ్డారు. 'దేశంలో చాలా మంది మంది ఆదాయం ఏటా 10లక్షల కన్నా ఎక్కువ ఉంది. అయితే వారంతా నిజాయితీగా పన్నులు చెల్లించి ప్రభుత్వాలకు తోడ్పడితే దేశం అభివృద్ధి చెందుతుంది.  నిజాయితికి పెద్ద పీట వేయాలన్నదే మా లక్ష్యం. ప్రస్తుతానికి నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నవారిని అభినందిస్తూనే.. అక్రమాలకు పాల్పడేవారిని తప్పక (కఠినతరమే అయినా) దారికి తెస్తాం'అని ప్రధాని చెప్పారు.