స్వామికి షాకిచ్చిన నరేంద్ర మోదీ!

27 Jun, 2016 15:58 IST|Sakshi
స్వామికి షాకిచ్చిన నరేంద్ర మోదీ!

న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌పై, కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. వ్యవస్థ కంటే తామే గొప్పవారమని ఎవరైనా అనుకుంటే అది సరికాదంటూ పరోక్షంగా స్వామికి షాక్‌ ఇచ్చారు. రాజన్ మానసికంగా భారతీయుడు కాదన్న స్వామి ఆరోపణలనూ మోదీ తోసిపుచ్చారు. రాజన్ దేశభక్తిని ఏమాత్రం శంకించలేమని, తామందరికీ తీసిపోని స్థాయిలో ఆయనలో దేశభక్తి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఆర్బీఐ డైరెక్టర్ రఘురాం రాజన్, కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆర్థిక ‍వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ లక్ష్యంగా స్వామి ఆరోపణల దాడితో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైట్లీపైనా పరోక్షంగా స్వామి విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ ఎంపీ చేసిన ఈ ఆరోపణలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధినాయకత్వం దూరం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామికి గట్టిగా షాకిచ్చేరీతిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘ఇది మా పార్టీలో జరింగిందా లేక వేరే పార్టీలోనా అన్నది పక్కనబెడితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీపై మోజుతో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగాల్సిన అవసరముంది. ఎవరైనా తాము వ్యవస్థ కంటే గొప్పవారమని అనుకుంటే అది తప్పు’ అని మోదీ తేల్చి  చెప్పారు. స్వామి వ్యాఖ్యలపై టైమ్స్ నౌ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు  చేశారు. రాజన్, ఇతర అధికారులపై విమర్శల గురించి అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిస్తూ వారిపై విశ్వాసం ప్రకటించారు. ఆర్బీఐ డైరెక్టర్ రాజన్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు