ఖాకీ కావరం

6 Mar, 2017 01:13 IST|Sakshi
ఖాకీ కావరం

రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన దళిత దంపతులపై ఎస్సై దాష్టీకం
- ‘కేసులా ఉన్నావ్‌.. దుకాణం నడుపుతున్నావా..?’ అంటూ వ్యాఖ్యలు
- నిలదీసిన భర్తను చితకబాదిన వైనం
- స్టేషన్‌కు తరలింపు.. అక్కడ మరో ఎస్సై దౌర్జన్యం
- భర్తను కొట్టొద్దంటూ కాళ్లావేళ్లా పడ్డ భార్య
- పక్కకు తోసేయడంతో కిందపడి అస్వస్థతకు గురైన భార్య
- పెద్దపల్లి జిల్లాలో దారుణం


పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్‌: 
వారు దళిత దంపతులు.. రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేం దుకు వెళ్లారు.. పిల్లలు మారాం చేస్తే వారినీ వెంట తీసుకెళ్లారు.. అంతా కలసి సొంత ఆటోలో పొలానికి చేరారు.. భర్త ఆటో దిగి మోటార్‌ స్టార్ట్‌ చేసేందుకు వెళ్లాడు.. ఇంతలో గస్తీ కాస్తున్న ఎస్సై అటుగా వచ్చాడు.. వాహనం ఆపి ‘ఇక్కడేం చేస్తున్నావ్‌..?’అంటూ ఆమెను గద్దించాడు.. పొలానికి నీళ్ల కోసం వచ్చామంది.. అందుకు ఎస్సై.. ‘చాల్లే ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతు న్నావా..’అంటూ నానా దుర్భాషలాడాడు!

ఇంతలోనే అక్కడికి వచ్చిన ఆమె భర్త.. ఎస్సై ప్రవర్తనపై నిలదీశాడు. అంతే.. ఆ ఎస్సైకి ఎక్కడలేని కోపమొచ్చింది! నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ఆయన్ను చితకబాదాడు. భార్య కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. జీపులో వారిద్దరినీ తీసుకెళ్లి స్టేషన్‌లో పడేశాడు. అక్కడ మరో ఎస్సై.. ‘మాకే ఎదురుచెబుతావా..?’అంటూ ఆయన్ను మళ్లీ తీవ్రంగా కొట్టాడు. అడ్డొచ్చిన ఆయన భార్యను నెట్టేయ డంతో ఆమె కింద పడి అస్వస్థతకు గురైంది. ఏ తప్పూ చేయకున్నా దంపతులపై పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు ఎస్సైలు సాగించిన దాష్టీకమిదీ!!

ఏం జరిగిందంటే..?
బాధితుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన అరికిల్ల మధునయ్యకు ధర్మారం ప్రధాన రోడ్డుకు రెండెకరాల భూమి ఉంది. అందులో వరి పంట వేశాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టి రావాల్సిందిగా మధునయ్య తన కొడుకు దేవేందర్‌కు చెప్పాడు. దీంతో ఆయన తన సొంత ఆటోలో పొలానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. మేమూ వస్తామంటూ పిల్లలు అపర్ణ, సంపూర్ణ, బ్లెస్సీ మారాం చేశారు. పిల్లలతోపాటు దేవేందర్‌ భార్య శ్యామల కూడా బయల్దేరింది. అంతా కలసి పొలానికి వెళ్లారు. మోటార్‌ను స్టార్ట్‌ చేసేందుకు దేవేందర్‌ వెళ్లగా.. భార్యాపిల్లలు ఆటోలో కూర్చున్నారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ధర్మారం ఎస్సై హరిబాబు పోలీస్‌ వాహనం ఆపి.. ఇక్కడేం చేస్తున్నావంటూ శ్యామలను ప్రశ్నించాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వచ్చామని ఆమె చెప్పినా వినలేదు.
(ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల, పక్కనే పిల్లలు)

‘ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతున్నావా..’అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అప్పుడే వచ్చిన దేవేందర్‌.. ఏం మాట్లాడున్నారంటూ ఎస్సైని నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన ఎస్సై అతడిని కొట్టాడు. ఈ సమయంలో ఎస్సై తన ఒంటిపై దుస్తులను కూడా చించాడని శ్యామల ఆరోపించింది. అనంతరం ఎస్సై వారిద్దరినీ పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనను స్థానిక ఎస్సై శ్రీనివాస్‌కు చెప్పాడు. ‘మాకే ఎదురుచెబుతావా..’అంటూ దేవేందర్‌ను శ్రీనివాస్‌ స్టేషన్‌లో మళ్లీ కొట్టారు. తన భర్త ఏ తప్పు చేయలేదని, స్టేషన్‌లో శ్యామల కేకలు వేయడంతో పోలీసులు ఆమెను నెట్టివేశారు. దీంతో కింద పడి ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు.

భార్యాభర్తలపై కేసు: ఎస్సై శ్రీనివాస్‌
ధర్మారం ఎస్సై హరిబాబుపై అనుచితంగా ప్రవర్తించిన దేవేందర్, శ్యామలపై కేసు నమో దు చేశామని పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపా రు. దేవేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఏం చేస్తున్నారన్నందుకు ఎస్సైపై దౌర్జన్యం చేయడంతో వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. శ్యామలను సోమవారం అరెస్టు చేస్తామన్నారు.

కాళ్లావేళ్లా పడ్డా..
తన భర్తను కొట్టొద్దని ఎంత వేడుకున్నా ఎస్సై శ్రీనివాస్‌ కనికరించలేదని శ్యామల కన్నీటి పర్యంతమైంది. పోలీసుల దెబ్బలకు నడవలేకపోతున్నాడని తెలిపింది. ఆదివారం తన భర్తను చూపించాలని పోలీసులను కోరినా చూపించలేదని వివరించింది. పోలీసుల తీరుకు నిరసనగా బొంపల్లికి చెందిన దళిత మహిళలు, సీఐటీయూ నాయకులు, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ నాయకులు స్థానిక సివిల్‌ ఆస్పత్రి వద్ద రాస్తారోకో చేశారు. బసంత్‌నగర్‌ ఎస్సై విజయేందర్, పెద్దపల్లి ట్రాఫిక్‌ ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చేసిన 16 మందిపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దళిత దంపతులపై అరాచకానికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్‌ చేశారు.

(ఎస్సై హరిబాబు, ఎస్సై శ్రీనివాస్‌)
ఎస్సైలపై ఫిర్యాదుల పరంపర
పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ సాయం త్రం 7 గంటలు దాటితే రోడ్లపై యువకులు కనిపిస్తే చితకబాదుతున్నారని పలువురు బాధితులు ఇటీవల ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లిలోని కమాన్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువకుడు ఎస్సై కోచింగ్‌ కోసం మిత్రులతో కలసి చర్చిస్తుండగా.. రోడ్డుపై ఏం చేస్తున్నారంటూ లాఠీతో బాదారు. దీంతో ఆ యువకుడు పైఅధికారికి ఫిర్యాదు చేశాడు. మజీద్‌ చౌరస్తా వద్ద ఓ విద్యార్థి ఇంటి ముందు ఫోన్‌ మాట్లాడుతుంటే అకారణంగా కొట్టాడంటూ అతడి తండ్రి డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై హరిబాబు తన కారును సొంతానికి వాడుకుంటూ బెదిరిస్తున్నాడంటూ ధర్మారానికి చెందిన ఎల్లాల మహేందర్‌రెడ్డి ఐదు రోజుల క్రితం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటుంటే ఎస్సైలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.