కర్నూలులో కన్హయ్య.. ఉద్రిక్తత

28 Jul, 2017 18:37 IST|Sakshi
కర్నూలు: కన్హయ్య సభలో ఉద్రిక్తత.. లాఠీచార్జ్‌

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ పాల్గొన్న బహిరంగ సభలో ఉద్రిక్తత చెలరేగి, లాఠీచార్జ్‌కు దారితీసింది.

సీపీఐ అనుబంధ ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ సంఘాలు శుక్రవారం పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభలో కన్హయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అయితే, ఓ యువకుడు.. కన్హయ్యకు వ్యతిరేకంగా, మత సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగా నినాదాలు చేసి ప్రసంగానికి అడ్డుతగిలాడు. దీంతో ఉద్రిక్తత చెలరేగింది. సీపీఎం కార్యకర్తలు.. ఆ యువకుడిని పట్టుకుని చితకబాదే ప్రయత్నం చేశారు. అంతలోనే స్పందించిన పోలీసులు.. కార్యకర్తల బారి నుంచి యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గని కార్యకర్తలు సదరు యువకుడిని పరుగెత్తించిమరీ కొట్టారు. ఈక్రమంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు.

అతను.. సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీస్‌!
కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగా నినాదాలుచేసి తన్నులు తిన్న యువకుడు పోలీస్‌ కానిస్టేబుల్‌ అని తెలిసింది. సివిల్‌ డ్రెస్‌లో సభకు వచ్చిన అతను ఉద్దేశపూర్వకంగానే కన్హయ్య  ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడని సమాచారం. సభలో గందరగోళం సృష్టించిన యువకుడు పోలీస్‌ కానిస్టేబుల్‌ అన్న సంగతి అక్కడున్న పోలీసులకు ముందే తెలుసని, అతన్ని కాపాడుకునేందుకు తమపై లాఠీచార్జి చేశారని ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు ఆరోపించారు. దీనిపై పోలీస్‌ అధికారులు స్పందించాల్సిఉంది.

మరిన్ని వార్తలు