చస్తుంటే చోద్యం చూస్తున్నారా?

24 Apr, 2015 17:55 IST|Sakshi
రైతు ఆత్మహత్యను పరికిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా

దేశ రాజధాని హస్తినలో అందరూ చూస్తుండగా ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పాల్గొన్న ఆమ్ ఆద్మీ ర్యాలీలో భూమిపుత్రుడి బలవన్మరణం పుణ్యధరిత్రిలో సాగుదారుల వెతలకు సజీవ సాక్ష్యం. విత్తు నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలో వంచనకు గురవుతున్న రైతుల ఆవేదన వర్ణనాతీతం. ప్రకృతి సహకరించక, పాలకులు కనికరించక రాలిపోతున్న రైతులు ఎందరో.

రాజస్థాన్ కు చెందిన గజేంద్ర సింగ్ అనే రైతు ఢిల్లీ నడిబొడ్డున.. వేలాది మంది చూస్తుండగా ఆత్మహత్య చేసుకున్నా అందరూ చోద్యం చూశారే తప్పా ఆపేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. పోలీసులు, పాలకులు, ప్రెస్ వాళ్లు ఎంత మంది ఉన్నా ఒక నిండు ప్రాణాన్ని కాపాడలేపోయారు. చనిపోయేందుకు చెట్టు ఎక్కిన రైతును చూసి వినోదించారే గానీ అతడి ఆయువును నిలిపాలన్న ఆలోచన ఏ ఒక్కరికి రాకపోవడం శోచనీయం. కళ్ల ముందే ఒకడు చస్తుంటే చలనం లేకుండా చూస్తుండి పోయిన వారిని ఏమనాలి?

అన్ని అంశాల మాదిరిగానే అన్నదాత ఆత్మహత్యపైనా పాలకులు బ్లేమ్ గేమ్ మొదలు పెట్టారు. రైతు చావుపై రాద్ధాంతం చేస్తున్నారు. అందరూ చూస్తుంగానే అన్నదాత కడతేరిపోయాడన్న కనికరం కూడా లేకుండా పరస్పరం కాట్లాడుకుంటున్నారు. సేద్యకారుల చావులకు  కారణమవుతున్న సాగు సంక్షోభం సమస్య పరిష్కారానికి దారులు వెతక్కుండా రోత రాజకీయాలు చేస్తున్నారు. అన్ని విధాలుగా అన్యాయమైపోతున్న అన్నదాతను ఒడ్డునపడేసేందుకు బదులు బురద చల్లుడుకు దిగుతున్నారు.

ఆప్ నేతలు రెచ్చగొట్టడం వల్లే రైతు ప్రాణాలు తీసుకున్నాడన్న పోలీసులు ఆరోపణలు నిజమే అయితే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. చివరి నిమిషంలో అన్నదాతను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు గండి కొట్టారన్న ఖాకీల నిందలు దడ పుట్టిస్తున్నాయి. కళ్ల ముందే రైతు ప్రాణాలు తీసుకుంటుంటే ఖాకీలు చేతులు ముడుచుకుని కూర్చున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నింటికీ మించి అన్నదాత జేబులోంచి పడిన సూసైడ్ నోట్ ను దక్కించుకునేందుకు మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారన్న అభాండాలు విస్తుగొల్పుతున్నాయి. ఇవన్ని చూస్తుంటే గజేంద్రను విపరీత చర్య దిశగా రెచ్చగొట్టారన్న అతడి కుటుంబ సభ్యుల ఆవేదనలో నిజముందని అనిపించక మానదు.   
-పి. నాగశ్రీనివాసరావు

మరిన్ని వార్తలు