సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను మీరే కాపాడాలి : రాజన్

26 Jul, 2016 19:50 IST|Sakshi
సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను మీరే కాపాడాలి : రాజన్

న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యాంకుల స్వాతంత్ర్యాన్ని కచ్చితంగా ప్రభుత్వాలే పరిరక్షించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు పెంపు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు ఎలాంటి సాక్ష్యాలు లేని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయని రాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. బ్రెగ్జిట్ పరిణామ క్రమంలో బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ ఎదుర్కొన్న దాడులు, పెరిఫీరియల్ ఆర్థికవ్యవస్థను స్థిరీకరించే సమయంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఇంటరెస్ట్-రేట్ గైడ్ లైన్స్ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎదుర్కొన్న అటాక్స్ను ఆయన గుర్తుచేశారు.

ఆయా సెంట్రల్ బ్యాంకులు తమ భూభాగ పరిధిలోనే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాయని ముంబైలోని ప్రెస్ స్టేట్మెంట్లో రాజన్ వ్యాఖ్యానించారు. సాక్ష్యాలు లేని ఇలాంటి నిందారోపణలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దృష్టిసారించాలని, సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలను వృద్ధి బాటలో నడిపించడానికి సెంట్రల్ బ్యాంకులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాయని.. సెంట్రల్ బ్యాంకులపై ఎలాంటి ఆధారాలు లేని విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. కాగ, భారత సెంట్రల్ బ్యాంకు గవర్నర్గా రాజన్ రెండోసారి కొనసాగింపుపై, బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యం స్వామి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం ఈ సెప్టెంబర్లో ముగియనున్న నేపథ్యంలో ఈ కామెంట్లు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు