కాలుష్యం.. చిన్నారుల పాలిట శాపం

7 Mar, 2017 18:13 IST|Sakshi

ఏటా 17 లక్షల చిన్నారుల మృత్యువాత

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం వల్ల ఏటా 17 లక్షల మంది అయిదేళ్లలోపు చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తేల్చిచెప్పింది. కలుషిత నీరు, ఇంట్లో పొగతాగడం, పారిశుధ్యం లేకపోవడం తదితర కారణాల వల్ల చిన్నారుల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ సోమవారం తన నివేదికలో తెలియజేసింది. పిల్లల్లో ఎక్కువమంది డయేరియా, మలేరియా, న్యుమోనియాతో చనిపోతున్నారని తేల్చిచెప్పింది.

వాతావరణ కాలుష్యం చిన్నారుల పట్ల శాపంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మార్గరెట్‌ చాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లేత శరీరాలు, అప్పుడప్పుడే ఏర్పడుతున్న రోగనిరోధక వ్యవస్థ ఈ కాలుష్యాన్ని తట్టుకోలేక పోతున్నాయని చాన్‌ విశ్లేషించారు. ‘ప్రతి సంవత్సరం న్యుమోనియా వల్ల అయిదేళ్లలోపు 5,70,000 మంది చిన్నారులు చనిపోతున్నారు. పరిశుభ్రమైన నీరు దొరక్క డయోరియాతో 3,61,000 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. పుట్టిన చిన్నారుల్లో దాదాపు 2.70 లక్షల మంది అపరిశుభ్ర వాతావరణం కారణంగా నెలరోజుల్లోనే కన్నుమూస్తున్నారు. మలేరియాతో ఏడాదికి 2 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. మరో రెండు లక్షల మంది అయిదేళ్లలోపు పిల్లలు గాయాలు విషపూరితమై చనిపోతున్నారు.

విషపూరితమైన పర్యావరణం మన పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంద’ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ మారియా నైరా తెలిపారు. పరిశుభ్రమైన నీటిని అందించడంతో పాటు పునర్వియోగ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ కాలుష్యాన్ని చాలా వరకూ తగ్గించవచ్చని నీరా అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారని తెలిపింది.

మరిన్ని వార్తలు