అమ్మ కోసం రూ.5 లక్షల చోరీ..

27 Aug, 2015 19:38 IST|Sakshi

చెన్నై : తన తల్లి వైద్య ఖర్చుల కోసం చోరీ చేశాడు. తీరా తల్లి చనిపోవడంతో చోరీ చేసిన సొమ్ములో ఖర్చు చేయగా మిగిలిన డబ్బును బాధితులకు అప్పగించాడు. ఖర్చు చేసిన సొమ్ముకు బదులుగా తన మోటార్ సైకిల్‌ను వదిలిపెట్టి కటకటాలపాలయ్యాడు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. పుదుక్కొట్టై పెరియార్ నగర్‌కు చెందిన రాజమాణిక్యం (75) రిటైర్డు ప్రభుత్వ అధికారి. కాగా ఈ నెల 24వ తేదీన బ్యాంకు నుంచి రూ.5 లక్షలు డ్రా చేసి ఇంటికి తీసుకెళ్లాడు. భార్య కాత్యాయిని చేతికి డబ్బుల బ్యాగు ఇచ్చి ఆయన బయటకు వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు వచ్చి తాగేందుకు నీళ్లు కావాలని ఆమెను కోరాడు. నీళ్లు తెచ్చేందుకు ఆమె లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న డబ్బు బ్యాగుతో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగారుపడిన కాత్యాయిని భర్తకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ నెల 26వ తేదీన సదరు యువకుడు రాజమాణిక్యం ఇంటికి చేరుకుని రూ.4.5 లక్షలున్న బ్యాగును అందజేశాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుప్రతిలో ఉన్న తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం గత్యంతరం లేని పరిస్థితుల్లో చోరీకి పాల్పడ్డానని, దురదృష్టవశాత్తు తల్లి చనిపోయిందని తెలిపాడు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు పోగా మిగిలిన సొమ్మును ముట్టజెబుతున్నానని, తాను ఖర్చుపెట్టుకున్న రూ.50 వేలకు బదులుగా తన మోటార్ సైకిల్‌ను వదిలి వెళ్తున్నానని చెప్పి పరుగందుకున్నాడు. ఇరుగుపొరుగువారు యువకుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు విరాలీమలైకి చెందిన మన్సూర్ (20) అని, తిరుచ్చిలోని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి అని గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు