పొన్నూరు అ‍బ్బాయి... పోలాండ్‌ అమ్మాయి

3 Jul, 2017 11:14 IST|Sakshi
పొన్నూరు అ‍బ్బాయి... పోలాండ్‌ అమ్మాయి

గుంటూరు : ప్రేమకు ఎల్లలు లేవు... ప్రేమ అనేది రెండు అక్షరాలే, అయితేనేమీ... ఎక్కడెక్కడి వారినో ఒక్కటి చేస్తుంది. ఎల్లలు లేవంటుంది. భాషాభేదం అడ్డు కాదంటుంది. చిన్ని పరిచయాన్ని తనలో ఇముడ్చుకుని పెళ్లిపీటల వరకూ తీసుకెళ్తుంది. ఈ పొన్నూరు అబ్బాయి విషయంలో అచ్చం అలాగే జరిగింది. పట్టణానికి చెందిన కొప్పోలు శరత్‌చంద్ర ఉన్నత విద్యనభ్యసించేందుకు పోలాండ్‌ వెళ్లారు. అక్కడ ఎంఎస్‌ పూర్తి చేసి ముఖ్య పట్టణం వార్సాలో ఫ్యూచర్స్‌ స్టెప్‌ కంపెనీలో ఆరునెలల నుంచి రిక్రూట్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

వార్సాకు చెందిన ఆగ్నేజ్కా పిహెచ్‌డీ చేస్తోంది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లే శరత్‌ చంద్రకు అక్కడ ఆగ్నేజ్యా ఏడాది కిందట పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. సహజంగానే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే ఆగ్రేజ్కా తల్లిదండ్రులు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

మరోవైపు శరత్‌ చంద్ర కూడా తన తల్లిదండ్రులను ఒప్పించాడు. దీంతో ఆగ్నేజ్కా, శరత్‌చంద్ర వివాహానికి రూట్‌ క్లియర్‌ అయింది. శనివారం రాత్రి సజ్జా కళ్యాణ మండలంలో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఆగ్నేజ్కాతో పాటు ఆమె తల్లి, సోదరి కూడా భారతీయ సంప్రదాయంలో దుస్తులు ధరించడం అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు