పేద మహిళల పెన్నిధిగా ‘స్త్రీ నిధి’

3 Sep, 2015 02:41 IST|Sakshi
పేద మహిళల పెన్నిధిగా ‘స్త్రీ నిధి’

స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్
* సంఘటితంగా ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చు
* వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: పేద మహిళల కోసం ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంక్ మహిళల సార థ్యంలోనే సాగుతూ నాలుగేళ్లుగా అద్భుత ప్రగతిని సాధిస్తోందని, స్వయం సహాయక గ్రూపుల ద్వారా సత్వర రుణాలను అందిస్తూ పేద మహిళల పాలిట పెన్నిధిగా మారిందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
 
మహిళలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సృష్టించగలరనేందుకు స్త్రీనిధి బ్యాంక్ సాధించిన ప్రగతే నిదర్శనమన్నారు. ‘తెలంగాణ స్త్రీ నిధి బ్యాంక్’ తొలి వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.. రాష్ట్రంలో 470 మండల సమాఖ్యలు, 20 వేల గ్రామ సమాఖ్యలు, 4.20 లక్షల స్వయం సహాయక గ్రూపుల ద్వారా 60 లక్షల మంది పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్యాన్ని అభినందించారు.
 
రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు..
రాష్ట్రవ్యాప్తంగా బాగా పనిచేస్తున్న స్వయం సహాయక గ్రూపులకు వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందని, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరికీ సురక్ష బీమా యోజన ద్వారా ప్రమాదబీమా సదుపాయాన్ని త్వరలోనే కల్పించబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న స్త్రీనిధి బ్యాంక్‌కు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా దళారులను నియంత్రించేందుకు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది మహిళలకు రూ.1,005 కోట్లతో 25 వేల ఉత్పత్తి(పాడి పరిశ్రమ, మేకల, గొర్రెల పెంపకం తదితర) యూనిట్లను అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల భాగస్వామ్యం, యాజమాన్యంలోనే నడుస్తున్న స్త్రీనిధి బ్యాంక్ గతేడాది 68 శాతం వృద్ధిరేటు సాధించిందని బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామాల్లో గ్రామ సమాఖ్యల ద్వారా బ్యాంకింగ్ సేవలను స్త్రీనిధి బ్యాంక్ అందిస్తోందన్నారు.
 
ప్రతిన బూనిన సంఘాలు
‘‘ప్రభుత్వంతో కలసి స్థాపించిన స్త్రీనిధి బ్యాంకు చక్కగా పనిచేసేందుకు, సంస్థ నుంచి సభ్యుల జీవనోపాధులకు, ఇతర అవసరాల నిమిత్తం సత్వర అప్పు ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అందరి భాగస్వామ్యంతో స్త్రీనిధి బ్యాంకును మరింత పటిష్టం చేసి నిరుపేద మహిళలకు పెన్నిధిగా తయారు చేస్తాం’’ అని సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు కేటీఆర్ బహుమతులు అందించారు.

2013-14 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద వచ్చిన డివిడెండ్ రూ.2,60,58,000 చెక్కును స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్లు మంత్రికి అందజేశారు. బ్యాంకు అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో మురళి, స్త్రీనిధి బ్యాంకు అధ్యక్షురాలు గడ్డం సరోజ, కోశాధికారి బత్తిని స్వరూప, నాబార్డు మాజీ సీజీఎం మోహనయ్య, పలువురు డెరైక్టర్లు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు