మరింత మానవత..!

26 Sep, 2015 03:36 IST|Sakshi
మరింత మానవత..!

పేదరికం, పర్యావరణంపై ప్రపంచానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపు
* ఐరాస, ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి
* ప్రకృతి వనరులను ధ్వంసం చేసే హక్కు మనిషికి లేదు
* ఐరాస సర్వప్రతినిధి సమావేశంలోప్రసంగం
న్యూయార్క్: పేదల ప్రయోజనాలను, పర్యావరణాన్ని గౌరవించే మరింత మానవీయమైన అంతర్జాతీయ వ్యవస్థ కావాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి పిలుపునిచ్చారు. బలహీనులను అభివృద్ధి ఫలాలకు దూరం చేసే ఆర్థిక వ్యవస్థపై విమర్శలు సంధించారు.

అమెరికాలో పర్యటిస్తున్న పోప్ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ సమావేశంలో ప్రసంగించారు. సంస్కరణవాదిగా పేరొందిన ఆయన ఉన్నతమైన ప్రపంచ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. క్రైస్తవులపై వేధింపులు, ఇరాన్ అణు ఒప్పందం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాలికల విద్యా హక్కు వంటి కీలక వర్తమాన సమస్యలను స్పృశించారు.

ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో, రుణదాతల సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల దుర్వినియోగాన్ని, అధిక వడ్డీరేట్లకు అడ్డుక ట్ట వేయడానికి ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. సంస్కరణవాద ఆలోచనలతో నాస్తికుల మెప్పు కూడా పొందుతున్న 78 ఏళ్ల పోప్ ఆయా అంశాలపై ఏమన్నారో ఆయన మాటల్లోనే..
 
సుస్థిర అభివృద్ధి కావాలి.. దేశాల  సుస్థిర అభివృద్ధిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కాపాడాలి. అణచివేత రుణ విధానాలకు, జనాన్ని మరింత పేదరికంలో ముంచే విధానాలకు దూరంగా ఉండాలి.(పోప్ స్వదేశం అర్జెంటీనా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఆంక్షలతో ఆర్థిక సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు). ఇరాన్‌తో అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం శక్తిమంతమైన రాజకీయ సౌహార్దానికి, నిజాయితీకి, సహనానికి చిహ్నం.
 
వాతావరణ మార్పులను అరికట్టాలి..

వాతావరణ మార్పుల నిరోధంపై డిసెంబర్‌లో ప్యారిస్‌లో జరిగే ఐరాస ఉన్నత సమావేశంలో మౌలికమైన, శక్తిమంతమైన ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాను. ఈ విశ్వం.. సృష్టికర్త  ఇచ్చిన ప్రేమాస్పద  ఫలం. దాన్ని దుర్వినియోగం, విధ్వంసం చేసే అధికారం మానవజాతికి లేదు. స్వార్థం, అధికారం కోసం, భౌతిక సంపదల కోసం అంతులేని దాహం సహజవనరుల విధ్వంసానికి దారి తీస్తోంది. బలహీనులను వాటికి దూరం చేస్తోంది. పర్యావరణ దుర్వినియోగంతో పేదలు దారుణ అన్యాయానికి గురవుతున్నారు.
 
క్రైస్తవుల భద్రత తదితరాలపై..
ప్రపంచమంతా శాంతి పరిఢవిల్లాలి. సిరియా, ఇరాక్‌లలో తీవ్రవాదులు వేధిస్తున్న క్రైస్తవులకు, ఇతర మతాల వారికి భద్రత కావాలి. లక్షలాదిమందిని నిశ్శబ్దంగా చంపుతున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలి. బాలికలతోపాటు బాలలందరికీ విద్యాహక్కు కల్పించాలి. దీనికి ఐరాస గురుతర బాధ్యత తీసుకోవాలి. అసంబద్ధమైన పద్ధతులు, జీవన శైలులను బలవంతంగా రుద్దకూడదు. కాగా  శుక్రవారం అమెరికన్లు  న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పోప్‌కు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు