స్థిరపడుతున్న సానుకూలత!

3 Oct, 2015 01:29 IST|Sakshi
స్థిరపడుతున్న సానుకూలత!

హైదరాబాద్: మూడు నెలల నుంచి అమ్మకాల ప్రవాహం మొదలైంది. దీంతో నగర నిర్మాణ రంగం నెమ్మదిగా ఊపిరిపీల్చుకుంటోంది. పాత నిర్మాణాల్లో ఫ్లాట్లు లేకపోవడంతో.. పలు సంస్థలు ఏకంగా అమ్మకాలనే నిలిపివేశాయి. సరైన స్థలాల కోసం బడా నిర్మాణ సంస్థల మధ్య పోటీ మొదలైంది. తక్షణమే ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు వేగంగా అడుగులేస్తున్నారు. మొత్తానికి 2015 చివరి నాటికి నగర స్థిరాస్తి రంగంలో మళ్లీ సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాల జోరు రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

నిన్నటి దాకా రేటు పెంచాలంటే భయం. చదరపు అడుక్కీ వంద రూపాయలెక్కువ చెబితే.. కొనుగోలుదారులు కొనరేమోనన్న దిగులు. చివర్లో వెనుకడుగు వేస్తారేమోనని మార్కెటింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఫ్లాట్లను విక్రయించేవారు. దాదాపు ఇదే పరిస్థితులు మూడేళ్ల నుంచి నగర నిర్మాణ రంగంలో నెలకొన్నాయి. కానీ, గత మూడు నెలలుగా పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వేచి చూసే ధోరణికి అలవాటు పడ్డవారిలో కొందరు.. మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో రాజకీయ పరిస్థితులను పక్కన పెట్టేసి సొంతిళ్లను కొనడానికి ముందుకొస్తున్నారు.

భిన్నమైన మార్కెట్..
స్థిరాస్తి రంగం చాలా భిన్నమైంది. మార్కెట్ ప్రతి కూలంగా ఉందనుకోండి.. ధర తక్కువైనా ఇళ్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకురారు. అదే కొం చెంతేరుకోగానే చాలు.. చదరపు అడుక్కీ వంద రూపాయలు ఎక్కువ పెట్టయినా ఇళ్లను కొనేస్తారు.  రెండు నెలల నుంచి వాణిజ్య స్థిరాస్తి రంగం కూడా మెరుగైంది. మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుండటం.. స్టాక్ మార్కెట్ సానుకూలంగా ఉండటం వల్ల స్థిరాస్తి రంగంలో పె ట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.

స్థలాల కోసం..
మార్కెట్ పెరిగిన సానుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పలువురు బిల్డర్లు. డెవలపర్లు సరైన స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల నుంచి మెట్రో నగరాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో స్థలాల కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి. మార్కెట్లో నెలకొన్న గిరాకీని అర్థం చేసుకున్న పలువురు స్థల యజమానులు ఇష్టమొచ్చిన రేట్లు చెబుతున్నారు. తమ కోర్కెల చిట్టాను డెవలపర్ల ముందు పెడుతున్నారు. అయితే భూయజమానులు చెబుతోన్న నిబంధనలకు కొందరు డెవలపర్లు అంగీకరిస్తున్నప్పటికీ.. పొరపాటున ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కనుక ప్రాజెక్ట్ పూర్తి కావటం ప్రశ్నార్థకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ మెరుగవ్వగానే నిర్మాణాన్ని ఆరంభించి.. ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం బదులు వాస్తవాల్ని అర్థం చేసుకుని నిర్మాణాలను మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే స్థల యజమానులూ వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుని డెవలపర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. లేకపోతే ఇరువురికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు.

ఓఆర్‌ఆర్ పూర్తయితే..
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఫ్లాట్ల రేట్లు నేటికీ అందుబాటులో ఉన్నాయన్నది డెవలపర్ల మాట. ఓఆర్‌ఆర్, మెట్రో రైలు వల్ల ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతోందన్నారు. 2015 నాటికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగించటం మరింత సులువవుతుంది. దీని చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఫలితంగా పలు సంస్థలు విదేశీ తరహాలో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలను చేపడతాయి. ప్రయాణం చేయడం భారం కాదు కాబట్టి ఓఆర్‌ఆర్ చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. నగరంలో రూ.60-70 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనేవారు.. ఓఆర్‌ఆర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలను కొనుగోలు చేస్తారు.

నగరం నలువైపులా ఓఆర్‌ఆర్ అనుసంధానమైంది. రేడియల్ రోడ్లు కూడా పూర్తి కావాల్సి ఉంది. పైగా మెట్రో రైలు అతి త్వరలో మొదలవుతుంది. ఇలా రోడ్డు వ్యవస్థ నగరంలో మెరుగుకానుంది. పైగా ఆకాశవంతెనల్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇవన్నీ పూర్తయ్యాక శివారు ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సులువుగా సాగించే వీలుంటుంది. ఇప్పుడే కాకపోయిన కనీసం రెండేళ్లలో అయినా పూర్తయ్యే అవకాశముంది. ఇలాంటి అంశాలన్నీ క్షుణ్నంగా పరిశీలించిన కొనుగోలుదారులు నగరం కంటే కాస్త దూరమైనా శివారు ప్రాంతాల్లోనే స్థిరాస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు