పోస్ట్... పుస్తకాలొచ్చాయ్

13 Apr, 2015 01:20 IST|Sakshi
పోస్ట్... పుస్తకాలొచ్చాయ్
  • బడులకు బుక్స్ బట్వాడా చేయనున్న తపాలాశాఖ
  •  తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనకు యోచన
  •  లాజిస్టిక్ విభాగాన్ని పటిష్టం చేసుకునే దిశగా ముందుకు
  •  బట్వాడాపై ఆంధ్రప్రదేశ్‌తో త్వరలో ఒప్పందం
  • సాక్షి, హైదరాబాద్: ఆదరణ కోల్పోతున్న తపాలాశాఖ మనుగడ కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగుతోంది. ఉత్తరాల బట్వాడా ప్రధాన విధిగా ఉన్నప్పటికీ... దాన్నే అట్టిపెట్టుకుని ఉంటే క్రమంగా ప్రజలకు దూరం కావటం తథ్యంగా మారటంతో ఇతర రంగాల్లోకి అడుగుపెడుతోంది. కొంతకాలం కిందట లాజిస్టిక్ రంగంలోకి అడుగుపెట్టిన తపాలాశాఖ ఇప్పుడు మెల్లగా దాన్నే ప్రధాన విధిగా చేసుకుంటోంది.

    ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వాటిని తరలించేందుకు నిర్ణయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకోబోతోంది. తొలుత ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టింది. దీనికి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన అందజేయాలని భావిస్తోంది.
     
    యూనిఫామ్.. మందుల తరహాలో...

    ప్రస్తుతం తపాలాశాఖ ప్రత్యేకంగా లాజిస్టిక్స్ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి విడిగా వాహనాలు సమకూర్చుకుంది. ప్రైవేటు సరుకు రవాణా సంస్థల్లాగా అవకాశం ఉన్న అన్నిరకాల వస్తువులను తరలించేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ కోవలో ప్రభుత్వ విభాగాలకు సరుకు రవాణా చేసిపెట్టే అనుబంధ సంస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫామ్స్‌ను సరఫరా చేసింది.

    ఆప్కోతో ఉన్న అవగాహన మేరకు ఆ సంస్థ రూపొందించిన యూనిఫామ్స్‌ను స్కూళ్లకు తరలించింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాల తరలింపుపై దృష్టి సారించింది. మరోవైపు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులను సరఫరా చేసే ఆర్డర్‌నూ అమలు చేస్తోంది. నిరంతర మందుల సరఫరా పేరుతో ఏపీ పరిధిలో దాన్ని కొనసాగిస్తున్న తపాలాశాఖ త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోబోతోంది. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల తరలింపు బాధ్యత కూడా తపాలాశాఖకు దక్కే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు