కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ

15 Sep, 2015 00:24 IST|Sakshi
కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ

* యూనిట్‌కు రూ.2 రాయితీ
గత డిసెంబర్ 1 నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వనున్నారు. యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సబ్సిడీ గత డిసెంబర్ 1 నుంచి అమలుచేస్తారు.

కోళ్ల పరిశ్రమలు వినియోగించే కరెంటులో యూనిట్‌కు అయ్యే ఖర్చులో రూ.రెండు సబ్సిడీ ఇస్తారు. అన్ని లేయర్ ఫారాలు, బ్రాయిలర్ ఫారాలు, హేచరీస్, పౌల్ట్రీ ఫీడ్ మిల్స్‌లకూ సబ్సిడీ వర్తిస్తుంది. కోళ్ల పరిశ్రమకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ల జాబితాను తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ పశుసంవర్థక శాఖకు ఇస్తుంది. పశుసంవర్థక శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సంయుక్తంగా ప్రతీ విద్యుత్ కనెక్షన్‌ను పరిశీలించి ఏ రకమైన కోళ్ల పరిశ్రమో గుర్తించి... సబ్సిడీకి అర్హత ఉందో లేదో తేలుస్తారు.

అనంతరం పశుసంవర్థక శాఖ అధికారులు సబ్సిడీకి అర్హత ఉన్న కోళ్ల పరిశ్రమల కనెక్షన్ల వివరాలతో జాబితా తయారుచేసి డిస్కంలకు అందజేస్తారు. అందుకు అనుగుణంగా సబ్సిడీ పొందేందుకు ఇన్‌వాయిస్‌లను డిస్కంలు ఇస్తాయి. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమ వ్యాపారులు కరెంటు చార్జీల కింద యూనిట్‌కు రూ. 6.08 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం యూనిట్‌కు రూ. 2 రాయితీ ఇస్తే వ్యాపారులు రూ. 4.08 చెల్లిస్తే సరిపోతుంది.

దీంతో ప్రభుత్వంపై నెలకు రూ. 4 కోట్ల భారం పడనుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2 వేల లేయర్ కోళ్ల పరిశ్రమలున్నాయి. వాటిల్లో 4.5 కోట్లు గుడ్లు పెట్టే కోళ్లుంటాయి. అలాగే 6 వేల బాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి.

మరిన్ని వార్తలు