పేదరిక నిర్మూలనకే ‘ముద్ర’

26 Sep, 2015 02:53 IST|Sakshi
పేదరిక నిర్మూలనకే ‘ముద్ర’

చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు రుణాలు: వెంకయ్య నాయుడు
సాక్షి, హైదరాబాద్: నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే నిరుద్యోగులను స్వయంఉపాధి వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పేదరిక నిర్మూలనతోపాటు యువత, చిరు వ్యాపారులు, చేతివృత్తులవారికి తోడ్పాటు అందించేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టారని చెప్పారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర (మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ) యోజన పథకం ప్రచార కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు శుక్రవారమిక్కడ ప్రారంభించి, లబ్ధిదారులకు రుణపత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలతోపాటు వ్యాపారులు, చేతివృత్తులవారిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ప్రధాని మోదీ భావించారని, అందులో భాగంగానే ముద్ర యోజనకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

ముద్ర పథకానికి ఆర్‌బీఐ రూ. 20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు అర్హులైనవారికి రుణాలు మంజూరు చే స్తారన్నారు. అక్టోబర్ 2 వరకు ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రుణాల మంజూరులో రాజకీయ జోక్యం కూడా ఉండదని చెప్పారు. రుణాల చెల్లింపులో పేదలే ముందుంటారని, మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను 98 శాతం తిరిగి చెల్లించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.

పెద్ద పెద్ద పరిశ్రమలు, వ్యాపారులే బ్యాంకులకు బకాయిదారులుగా ఉన్నారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, పీహెచ్‌డీ చదివినవారు ఫ్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి బాధాకరమన్నారు. దేశంలో 4 కోట్ల మంది ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, జి. కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు