దేశంలో విద్యుత్ సంక్షోభం: ప్రధాని

3 Aug, 2013 02:59 IST|Sakshi

దేశం ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని, లోటును ఎదుర్కొంటోందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేదని, ఈ లోటును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లక్ష మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా తిరుమయంలో రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన భెల్ విద్యుత్ ప్లాంటు పైపింగ్ యూనిట్‌ను, హై ప్రెజర్ బాయిలర్ ప్లాంటు రెండో యూనిట్‌ను ప్రధాని శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఏడాదికి 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల తిరుమయం ప్లాంటును 40 ఎకరాల్లో నిర్మించారు.

దీన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతికి యూపీఏ ప్రభుత్వం పెద్ద పీట వేయడం వ ల్ల అనేక కొత్త కర్మాగారాలు ఏర్పడుతున్నాయన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక కింద 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించామని, గత ఐదేళ్ల కంటే ఇది ఒక శాతం అధికమన్నారు. విద్యుత్ రంగంలో భెల్ గణనీయమైన సేవలు అంది స్తోందని ప్రశంసించారు. వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిందని, భారత్‌లో గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు తగ్గించేందుకు కొత్త మార్గాలు అనుసరించాల్సి ఉందని ప్రధాని అన్నారు.

దేశంలో 50 శాతం విద్యుత్ బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతోందని, దీనివల్లే అత్యధికంగా గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదలవుతున్నాయన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సౌరశక్తి కార్యక్రమం కింద వచ్చే పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది వాతావరణ మార్పు సమస్య నివారణకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రపుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు