నేడో, రేపో విద్యుత్ ప్లాంట్ల మూత

30 Nov, 2013 01:13 IST|Sakshi
నేడో, రేపో విద్యుత్ ప్లాంట్ల మూత

 సింహాద్రి, రామగుండంలో నిండుకున్న బొగ్గు
4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
జెన్‌కో ప్లాంట్లకూ బొగ్గు ఇబ్బందులు
తుపానులు, ఎంసీఎల్‌లో స్థానిక గొడవల ఫలితం
అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ)కి చెందిన రెండు విద్యుత్ ప్లాంట్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఎన్‌టీపీసీకి చెందిన ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఈ ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు కొరత కారణంగా తక్కువ సామర్థ్యంతో విద్యుత్‌ను ఎన్‌టీపీసీ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు తుపానుతో పాటు ఒడిశాలో స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేని పోలీసులు అరెస్టు చేయడంతో మహానది కోల్ ఫీల్డ్స్(ఎంసీఎల్)లో శుక్రవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం కూడా బొగ్గు ఉత్పత్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్‌టీపీసీకి చెందిన రెండు ప్లాంట్లలో నేడో, రేపో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 అదేజరిగితే 4,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. రాష్ట్రంలో ఎన్‌టీపీసీకి విశాఖపట్నం సమీపంలోని 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహా ద్రితో పాటు రామగుండంలో 2,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ ఉంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుండటంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) ప్లాంట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. జెన్‌కోకు చెందిన విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)తో పాటు వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీపీ)లో ఐదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి.
 
  ఇక వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)తో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో కూడా ఒక రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంసీఎల్ నుంచి ఎన్‌టీటీపీఎస్‌తో పాటు ఆర్‌టీపీపీకి కూడా బొగ్గు సరఫరా అవుతుంది. ఎంసీఎల్ నుంచి బొగ్గు సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ఆర్‌టీపీపీలోనూ ఒక రోజుకు సరిపడా నిల్వే ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల ప్రకారం పిట్ హెడ్ ప్లాంట్ల (బొగ్గు గని పక్కనే ఉండే విద్యుత్ ప్లాంట్లు)లో 12 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అలాగే బొగ్గు గనులకు దూరంగా ఉండే విద్యుత్ ప్లాంట్లలో 15 రోజులకు సరిపడే నిల్వలు ఉండాలి. ఈ లెక్కన రాష్ట్రంలో కొత్తగూడెం మినహా అన్ని విద్యుత్ ప్లాంట్లలోనూ 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే బొగ్గు నిల్వలు ఉంచుకోవడంలో అధికారుల వైఫల్యం వల్లే ప్లాంటు మూతపడే పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు