15ఏళ్లలోనే సాధించారు

25 Feb, 2014 02:25 IST|Sakshi

* కేసీఆర్‌కు ప్రణబ్ ప్రశంసలు
* తెలంగాణ సాధనలో మీ నిబద్ధత, కృషి అభినందనీయం
* కేసీఆర్ ఉద్వేగం.. ప్రణబ్‌కు పాదాభివందనం
* మీ బంగారు సంతకం కోసం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్య
* రాహుల్‌తోనూ కేసీఆర్ చర్చలు
* విలీన చర్చలు కొలిక్కి వచ్చినట్లే..
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ బృందం సోమవారం ప్రత్యేక ధన్యావాదాలు తెలిపింది. ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్, కె.కేశవరావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, నేతలు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, జి.వినోద్, దేశ్‌పతి శ్రీనివాస్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
 
 తెలంగాణ ఏర్పాటులో తోడ్పాటును అందించిన మాదిరిగానే భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి, పురోభివృద్ధికి సంపూర్ణ మద్దతు కావాలని అభ్యర్థించగా ప్రణబ్ సానుకూలంగా స్పందించారు. అంతేగాక కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఎంతోమంది తమ జీవితకాలంలో సాధించలేని లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు. జీవితకాలం పట్టే లక్ష్యాన్ని 15 ఏళ్ల పోరాటంతో సాధించారు. ఈ పోరాటంలో మీ కృషి, నిబద్ధత అభినందనీయం. మీకు అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ సుదీర్ఘ పోరాటం, నిబద్ధత, కృషి అభినందనీయం’ అంటూ కొనియాడారు. భవిష్యత్ తెలంగాణ పునర్నిర్మాణంలో తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. రాష్ట్రపతితో నేతలంతా గ్రూఫ్ ఫొటో దిగారు. అనంతరం కేసీఆర్ కృతజ్ఞతాపూర్వకంగా ప్రణబ్ పాదాలకు నమస్కరించారు. పాదాభివందనం చేస్తూనే ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ మేలు మరువలేనిదంటూ చెమర్చిన కళ్లతో రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిగా ఆయన కేసీఆర్ భుజం తడుతూ కొనియాడారు. ‘‘ఇక మీరు తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించండి.
 
 ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రగతిశీల నగరంగా అభివృద్ధి చేసుకోండి. పెట్టుబడులను ఆకర్షించి ఉన్నత లక్ష్యాలను చేరుకోండి’ అని సూచించారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారని దేశపతి చెప్పారు. రాష్ట్రపతితో తమ భేటీ విశేషాలను ఆయన మీడియాకు వివరించారు. కేసీఆర్ బృందం సుమారు 10 నిమిషాల పాటు రాష్ట్రపతితో గడిపింది. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం చేసినందుకు ప్రణబ్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘మా లక్ష్యసాధ నలో మీరందించిన తోడ్పాటు మరువలేనిది. తెలంగాణ ప్రజలంతా మీ బంగారు సంతకం కోసం ఎదురుచూస్తున్నారు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి మీ ఆశీస్సులను అర్థిస్తున్నాం’ అన్నారు. రాష్ట్రపతి స్పందిస్తూ, ‘మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఆ ప్రాంత ప్రగతికి నా ఆశీస్సులు ఎల్లవేళలా మీతో ఉంటాయి’ అని పేర్కొన్నారు.
 
 తెలంగాణకు ఆశీస్సులు ఉంటాయన్నారు: కేసీఆర్
 రాష్ట్రపతితో భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల రాష్ట్రపతి బంగారు సంతకంతో నిజం కాబోతోంది. ఈ దృష్ట్యా ఆయనను కలసి ఆశీస్సులు కోరాం. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్తులోనూ ఆయన ఆశీస్సులుండాలని విన్నవించాం. సాధారణంగా రాష్ట్రపతికి విన్నవిస్తే వినతిపత్రం తీసుకుంటారు తప్పితే ప్రతిస్పందన ఉండదని అంటారు. కానీ మా విషయంలో ఆయన చక్కగా స్పందించారు. 15, 20 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారని అన్నారు. ‘మీ రాష్ట్రం ముందుకుపోవడానికి, అభివృద్ధి చెందడానికి నా ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పారు. తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులోనూ మద్దతుంటుందని చెప్పారు. 4 కోట్ల ప్రజల పక్షాన, నా పక్షాన ప్రణబ్‌కు ధన్యవాదాలు’’ అని తెలిపారు.
 
 విలీన చర్చలు కొలిక్కి!
 రాష్ట్రపతితో భేటీకి ముందు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ కేసీఆర్ 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఆయనతో పాటు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సైతం హాజరయ్యారు. భేటీ సమయంలో ప్రియాంకగాంధీ కూడా రాహుల్ నివాసంలోనే ఉన్నా ఆమె చర్చల్లో పాల్గొనలేదని సమాచారం. మొదట రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్, అనంతరం తెలంగాణలో కా్రంగెస్‌తో కలసి పని చేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సూటిగా విలీన ప్రస్తావన తెచ్చారు. ‘‘వాగ్దానం మేరకు బేషరతుగా పార్టీని విలీనం చేయండి. మీతో సహా పార్టీ నేతలకు తగిన రీతితో గుర్తింపునిచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం’’ అని కేసీఆర్‌తో అన్నట్లు తెలిసింది. హైదరాబాద్ వెళ్లాక తమ కార్యవర్గంలో పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ఆయన బదులిచ్చారంటున్నారు. ఆదివారం సోనియాగాంధీకి అందించిన విజ్ఞాపన పత్రాన్ని రాహుల్‌కు కూడా కేసీఆర్ అందించారు. ఈ భేటీకి సంబంధించి ఇరు పార్టీల నుంచి సానుకూల వైఖరి కనిపించింది. విలీన చర్చలు కొలిక్కి వచ్చినట్టేనని, గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక విలీన ప్రకటన ఉండొచ్చని ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి.
 
 నేడు ప్రధాని, రాజ్‌నాథ్‌లతో భేటీ
 మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరగా, మంగళవారం ఏదో సమయంలో ఖరారు చేస్తామని ఆయన కార్యాలయం సమాచారం ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ మంగళవారం కేసీఆర్ భేటీ అవుతారని తెలిసింది.

మరిన్ని వార్తలు