ఇక ‘ప్రాణహిత’ పరుగు!

25 Aug, 2015 01:23 IST|Sakshi
ఇక ‘ప్రాణహిత’ పరుగు!

పనులను వేగిరం చేయాలని సీఎం ఆదేశం
తుమ్మిడి హెట్టి దిగువ, అన్ని కెనాల్ పనులకు లైన్‌క్లియర్
ఒకట్రెండు రోజుల్లో పనుల ఆరంభానికి అవకాశం
ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో రూ.9,290 కోట్ల పనులు పూర్తి
లైడార్ సర్వే హెలికాప్టర్‌ను ఢిల్లీలో పరీక్షించిన రక్షణశాఖ

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో సమూల మార్పులకు దిగిన కారణంగా ప్రాజెక్టు పరిధిలోని అన్ని పనులను నిలిపివేసిన ప్రభుత్వం..తాజాగా గతంలో చేపట్టిన పనులన్నింటినీ పునఃప్రారంభించాలని నిర్ణయించింది.

ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ దిగువన ఎల్లంపల్లి వరకు చేపట్టిన పనులతో పాటు, ఆ దిగువ ప్యాకేజీ పనులను సైతం యథావిధిగా తిరిగి ఆరంభింపజేయాలని సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నందున, దీనిపై స్పష్టత వచ్చే వరకు నిర్మాణ పనులను పక్కనపెట్టాలని ఆయన సూచించినట్లుగా సమాచారం.

ప్రభుత్వ నిర్ణయంతో ఒకట్రెండు రోజుల్లో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రాణహిత-చేవెళ్ల తొలి డిజైన్ మేరకు ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి మిడ్‌మానేరు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వేసిన ప్రణాళికల ప్రకారం రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనుల్లో ఇప్పటికే రూ.9,290.26 కోట్ల పనులు పూర్తయ్యాయి.  
 
పనులకు ఓకే..
అయితే తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాల దృష్ట్యా ప్రాణహిత నీటిని అక్కడినుంచి కాకుండా, కాళేశ్వరం దిగువనుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్త డిజైన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక వచ్చేంతవరకు పనులు నిలిపివేయాలని ఏప్రిల్‌లో నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో ఐదు నెలలుగా పనులన్నీ నిలిచిపోయాయి. కాగా, ప్రస్తుతం ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలుగా చేసి తుమ్మిడిహెట్టిని కొనసాగిస్తూనే, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు.

ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.15వేల కోట్ల పనుల్లో రూ.4 వేల కోట్ల కెనాల్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను యాథావిధిగా కొనసాగించాలని ఆదివారం అర్ధరాత్రి వరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని ఏ ఎత్తులో కట్టాలన్న దానిపై మరోదఫా మహారాష్ట్రతో చర్చల అనంతరం నిర్ణయం చేద్దామని, ఆ తర్వాతే పనులు చేద్దామని సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ పనులతో పాటే మిడ్‌మానేరు దిగువన రూ.22,866 కోట్లతో చేపట్టిన పనులను వేగిరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
 
రెండు రోజుల్లో లైడార్ హెలికాప్టర్‌రాక..
ఇక కాళేశ్వరం ప్రాంతంలో చేయదలిచిన లైడార్ సర్వే పనులకు రంగం సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన హెలికాప్టర్‌ను ఆదివారం ఢిల్లీకి తరలించగా, అక్కడ ప్రత్యేక పరికరాలు అమర్చిన అనంతరం రక్షణ శాఖ దాన్ని పరీక్షించింది. దీనికోసం వ్యాప్కోస్ సర్వే సంస్థ రూ.2.50 కోట్లు వెచ్చించనుంది. ఈ హెలికాప్టర్ హైదరాబాద్ చేరుకునేందుకు మరో రెండు రోజులు పడుతుందని, ఆ వెంటనే సర్వే పనులను మొదలుపెడుతుందని అధికారులు చెబుతున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

సినిమా

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం