నాకు కారు.. అందులోకి పెట్రోలు మీరే ఇవ్వండి

29 Jul, 2015 15:35 IST|Sakshi
నాకు కారు.. అందులోకి పెట్రోలు మీరే ఇవ్వండి

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించారని దేశమంతా ఒక పక్క రోదిస్తుంటే.. ఆయన తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన ప్రతిభా పాటిల్ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనకు అధికారికంగా ఒక కారు కేటాయించాలని, దానికి పెట్రోలు బిల్లు కూడా చెల్లించాలని, వీటితో పాటు తన ప్రైవేటు వాహనాన్ని కూడా ఉపయోగించుకోడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ రాష్ట్రపతులకు సొంత వాహనం ఉంటే దానికి ఇంధన అలవెన్సు ఇస్తారు, అది లేకపోతే ప్రభుత్వ వాహనాన్ని కేటాయిస్తారు.

ప్రస్తుతం ప్రతిభా పాటిల్ కోరుతున్నట్లు చేయాలంటే నిబంధనలను మార్చాలి. పుణెలో ఉన్నప్పుడు తన సొంత కారు వాడుకుంటానని, వేరే ఊళ్లు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం వాడతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఇవ్వడం మాత్రం ప్రస్తుతానికి కుదరని పని. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు గత మూడు నెలలుగా ఆమె కార్యాలయంతో అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో.. సొంత కారు గానీ, అధికారిక వాహనం గానీ ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని చెబుతున్నారు.

తొలుత తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం సరిపోదని, అంతకంటే పెద్ద వాహనం పంపాలంటూ దాన్ని తిప్పి పంపేయడంతో వివాదం మొదలైంది. పెద్ద కారు రాకపోవడంతో ఇంధన అలవెన్సు వాడుకున్నారు. బయటి ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం కావాలనడంతో.. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పి, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లింది.

మరిన్ని వార్తలు