ప్రత్యూష అబార్షన్ చేయించుకుందా?

19 Apr, 2016 11:49 IST|Sakshi
ప్రత్యూష అబార్షన్ చేయించుకుందా?

చిన్నారి పెళ్లికూతురుగా టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య చేసుకోడానికి ముందు.. ఆమె అబార్షన్ చేయించుకుందట! ఈ విషయాన్ని జేజే ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఏప్రిల్ 2వ తేదీన ఆత్మహత్య చేసుకోడానికి కొద్దిరోజుల ముందే ఆమెకు అబార్షన్ అయిందని అంటున్నారు. ఆమె గర్భాశయం కణజాలాలను పరిశీలించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసు మొత్తం మరో కొత్త మలుపు తిరిగింది. ఆమె చనిపోవడానికి కొన్ని రోజులు లేదా.. ఒక నెల ముందుగా ఆమె గర్భంలోని శిశువు మరణించిందని కేసు దర్యాప్తు చేస్తున్న వర్గాలు తెలిపాయి. కావాలని అబార్షన్ చేయించుకోవడం లేదా గర్భం పోవడం వల్ల కలిగే పరిణామాలు ఆమె గర్భాశయంలో కనిపించాయి. దీనివల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ కూడా సోకి, దానికి చికిత్స కూడా చేయించుకున్నట్లు తెలిసింది. (చదవండి... టీవీ నటి ప్రత్యూష కేసులో మరో మిస్టరీ)

అయితే.. ఇలాంటి సందర్భాల్లో మృతశిశువుకు తండ్రి ఎవరన్న విషయాన్ని నిర్ధారించడం మాత్రం అంత సులభం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. గర్భాశయం లోపల పిండానికి సంబంధించిన కణాలు ఏమీ లేకపోవడంతో డీఎన్‌ఏ పరీక్ష చేయడం కూడా సాధ్యం కాదని అన్నారు. నటుడు, నిర్మాత అయిన రాహుల్ రాజ్‌సింగ్‌తో ప్రత్యూషకు బ్రేకప్ కావడం, వారిద్దరి మధ్య గొడవలు జరగడం లాంటివి తెలిసిందే. (చదవండి - పనిమనిషి దగ్గర అప్పులు చేసిన ప్రత్యూష)

ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను తాము వెల్లడించలేమని, నివేదికను పోలీసులకు అందించామని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే తెలిపారు. ప్రత్యూష మరణానికి కారణమేంటో తెలుసుకోడానికి చాలా విభాగాలు ప్రయత్నిస్తున్నాయని, మెడచుట్టూ బిగుసుకుపోవడం, ఊపిరి ఆడకపోవడం వల్లే ఆమె మరణించినట్లు ప్రాథమికంగా తెలిసిందని అన్నారు. ఒకవేళ ఉరికి ముందు ఆమె విషప్రయోగానికి గురైందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కూడా పరీక్షలు జరుగుతున్నాయి. ఆమె గోళ్లు, జుట్టు, రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్ష కోసం భద్రపరిచారు.

>
మరిన్ని వార్తలు