ఇలాగైతే సాధికారత ఎలా?

6 Mar, 2016 00:56 IST|Sakshi
ఇలాగైతే సాధికారత ఎలా?

మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో రాష్ట్రపతి
న్యూఢిల్లీ: చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకుండా మహిళా సాధికారత ఎలా సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రశ్నించారు. రెండు రోజులపాటు జరిగే మహిళా ప్రజాప్రతినిధుల మొట్టమొదటి జాతీయ సదస్సును శనివారం ఢిల్లీలో ప్రణబ్ ప్రారంభించారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ, దాదాపు 300 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు, సీఎంలతో పాటు బంగ్లాదేశ్ స్పీకర్ శిరిన్ శర్మిన్ చౌదురీ ఇందులో పాల్గొన్నారు.  పార్లమెంట్ సభ్యుల్లో మహిళా ప్రతినిధుల శాతం 12 శాతానికి మించడం లేదని అన్సారీ ఆవేదన వ్యక్తం చేశారు.

యూపీఏ హయాంలో ఒకసభలో బిల్లు ఆమోదం పొందినా... మరొక దాంట్లో ఆమోదానికి నోచుకోలేదని చెప్పారు. రిజర్వేషన్ కల్పించకుండా రాజకీయ పార్టీలు మూడోవంతు సీట్లు మహిళలకు ఇస్తాయనుకోవడం అత్యాశే అవుతుందన్నారు.  లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణంలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర’ ప్రధాన అంశంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సాంఘిక, ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు సుపరిపాలన, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
 
స్వచ్ఛందంగా సీట్లు కేటాయించాలి: అన్సారీ
సదస్సులో ఉపరాష్ట్రపతి అన్సారీ మాట్లాడుతూ.. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేవరకూ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు  కోటా పెంచాలని కోరారు. 2014 ఎన్నికల్లో జాతీయపార్టీలు కేవలం 146 మంది మహిళలకు టికెట్లిచ్చాయని,  మొత్తం సీట్లలో 9.17 శాతం మాత్రమే కేటాయించారన్నారు.  ఆర్థిక, అంచనాలు, రక్షణ, హోం శాఖ వ్యవహారాలపై ఏర్పాటైన కమిటీల్లో 124 మంది సభ్యులుండగా కేవలం ఆరుగురే మహిళలు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ సదస్సుకు హాజరుకాలేదు.

>
మరిన్ని వార్తలు