ఏపీ పోలీసుల తీరుపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆగ్రహం

7 Feb, 2017 04:01 IST|Sakshi

- రాజధాని భూములపై ప్రశ్నించిన ‘సాక్షి’ జర్నలిస్టులకు సమన్లు కేసు..
- విచారణకు హాజరుకాకపోతే కఠిన చర్యలని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌:
ఏపీ పోలీసుల తీరుపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రాజధాని భూముల కొను గోలుకు సంబంధించిన వ్యవహారాలను వెలుగు లోకి తెచ్చినందుకు ‘సాక్షి’ దినపత్రిక జర్నలిస్టులకు సమన్లు జారీ చేసిన కేసులో పోలీసులు పదేపదే వాయిదా కోరడంపై పీసీఐ అధ్యక్షుడు సి.కె.ప్రసాద్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో ఈ భూముల వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.

అయితే వార్త మూలాలు తెలపాలని జర్నలిస్టులను అడగటం పత్రికా స్వేచ్ఛకు విఘాతమని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ సెక్రెటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ గత ఏడాది మార్చి 22న ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం కలకత్తాలో జరిగిన విచారణలో సీఎం చంద్రబాబు పర్యటనను సాకుగా చూపి విచారణకు హాజరుకాకుండా రాష్ట్ర పోలీసులు వాయిదా కోరడంపై జస్టిస్‌ ప్రసాద్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇది ఆఖరి వాయిదా అని మరోసారి పోలీసులు విచారణకు హాజరు కాని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ తరఫున విచారణకు హాజరైన దేవులపల్లి అమర్‌ వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోనే ఉంటున్నారని, ఆయన పర్యటనను కారణంగా చూపి వాయిదా కోరడం హాస్యా స్పదమని ప్రెస్‌ కౌన్సిల్‌కు తెలిపారు. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీలో గత సెప్టెంబర్‌లో జరిగిన విచారణను వాయిదా వేయాలని గుంటూరు పోలీసు సూపరింటెండెంట్‌ కోరారు.

మరిన్ని వార్తలు