మోదీజీ.. బయటపడిన నల్లధనం ఎంత?

31 Dec, 2016 22:05 IST|Sakshi
మోదీజీ.. బయటపడిన నల్లధనం ఎంత?

హైదరాబాద్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన తన ప్రసంగంలో నోట్ల రద్దు వ్యవహారంపై ఎందుకు మాట్లాడలేదు?  500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత తర్వాత పాత నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి శనివారం చేసిన ప్రసంగంలో అనేక విషయాలను వెల్లడిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు.  నకిలీ నోట్ల చెలామణిని అరికట్టడం, నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ నవంబర్ 8వ తేదీన దేశంలో చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

రద్దు చేసిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గానీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గానీ కీలక ప్రకటన చేస్తుందని అంతా భావించారు. అయితే శనివారం సాయంత్రం 7.30 గంటలకు నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారన్న ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ప్రధాని ఎలాంటి విషయాలను వెల్లడిస్తారోనని ఆసక్తిని ప్రదర్శించారు.

మార్కెట్‌ లోకి కొత్త నోట్లు ఎన్నొచ్చాయి?
ప్రధానంగా రద్దయిన నోట్లు బ్యాంకుల్లో ఎంత మేరకు డిపాజిట్ అయ్యాయి? పరిమితికి మించి ఆడిట్ గానీ సొమ్మును ఎంత మంది వెల్లడించారు? జన్ ధన్ ఖాతాల్లో ఎంత మేరకు జమ అయ్యిందీ? ఈ పరిణామాల మొత్తంలో అసలు దేశంలో బయటపడిన నల్లధనం ఎంత? మార్కెట్ లో చలామణిలో ఉన్న 500, 1000 నోట్లలో ఎంత మేరకు తిరిగి బ్యాంకుల్లోకి చేరింది? కొత్త  కరెన్సీ 2000, 500 నోట్లను మార్కెట్ లోకి ఎంత మేరకు విడుదల చేశారు? కొత్తగా మళ్లీ వెయ్యి నోట్లను విడుదల చేస్తారా? కొత్త నోట్లను అక్రమంగా తరలిస్తూ ఎంత మేరకు పట్టుబడిందీ? కొత్త నోట్ల మార్పిడిలో ఎంతమంది అధికారులపై కేసులు నమోదు చేశారు? వంటి అంశాల్లో కొన్నింటినైనా ప్రధాని నోటి వెంట బయటి ప్రపంచానికి తెలుస్తాయని అంతా భావించారు. అయితే వీటిల్లో ఒకటి రెండు విషయాలను పైపై తడిమినప్పటికీ లోతుగా మాట్లాడకపోవడం అందరినీ విస్మయం కలిగించింది.

ఎంత కరెన్సీ బ్యాంకుల్లో చేరింది?
దేశంలో చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీలో 500, 1000 నోట్లు 86 శాతం ఉన్నాయి. ఈ నోట్లు దేశంలో 15.14 లక్షల కోట్ల మేరకు కరెన్సీ చలామణిలో ఉంది. ఇక వంద అంతకు తక్కువ డినామినేషన్ ఉన్న కరెన్సీ దేశంలో కేవలం 24 శాతం మాత్రమే చలామణిలో ఉంది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వాటిని బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగియగా, దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద రద్దయిన పెద్ద నోట్లు ఎంత మేరకు డిపాజిట్ అయ్యాయో ఈ మెయిల్ ద్వారా అన్ని బ్యాంకులు వివరాలు అందించాలని తక్షణాదేశాలు జారీ చేసింది. అంటే బ్యాంకుల నుంచి ఆ లెక్కల వివరాలు ఆర్బీఐకి చేరినట్టే. దేశంలో చలామణిలో ఉన్న 15.14 లక్షల కోట్ల రద్దయిన కరెన్సీలో ఎంత కరెన్సీ బ్యాంకుల్లో చేరింది? ఆ విషయం తెలిస్తే దేశంలో ఎంత మేరకు నల్లధనం ఉందన్న వివరాలు వెల్లడయ్యేవి. డిపాజిట్ చేయడానికి మరో 15 రోజుల గడువు ఉందన్నప్పుడే 13 లక్షల కోట్ల మేరకు రద్దయిన నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయని అప్పట్లోనే వార్తలొచ్చాయి.

బ్యాంకుల్లో అక్రమాలపై చర్యలేవి?
ఇలాంటి వివరాలు ప్రకటిస్తే ప్రధానమంత్రి తాను తీసుకున్న నిర్ణయంపై ఎంత మేరకు సఫలీకృమయ్యారన్నది స్పష్టంగా తెలిసేది. ప్రధాని ప్రతిష్ట కూడా మరింతగా ఇనుమడించేది. అయితే అలాంటి వివరాలేవీ వెల్లడించకపోవడంతో ప్రజల్లో మరింత అనుమానాలు రేకెత్తించే విధంగా పరిణామాలు కనిపిస్తాయి. నిజానికి దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసిన నేపథ్యంలో గడిచిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక చోట్ల అక్రమ మార్గాల్లో కొత్త కరెన్సీ నల్ల కుబేరుల ఇళ్లలోకి చేరిపోయినట్టు అనేక సందర్భాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత భారీ ఎత్తున సొమ్ము ఆ ఖాతాల్లో జమైనట్టు వార్తలొచ్చాయి. అయితే గడువు ముగిసిన తర్వాత వాటిపై ఇంతవరకు ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయకపోగా ప్రధానమంత్రి ఆ విషయంలో కొంత వివరణ ఇస్తారని భావించిన ఆ విషయాలేవీ వెల్లడించలేదు.

‘నోట్ల రద్దు’ఫలితాలపై అస్పష్టత!
భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో 23.2 శాతం నల్లధనం ఉందని ప్రపంచబ్యాంకు గతంలో వెల్లడించింది. అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015 మే 5 రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వాషింగ్టన్ కు చెందిన గ్లోబర్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ వెల్లడించిన దానిని బట్టి 2012 లో రూ. 6 లక్షల కోట్ల మేరకు నల్లధనం దేశం దాటిందని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసిన దరిమిలా ఒక్కో ఖాతాలో 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేసినట్టయితే వాటికి లెక్కలు అడుగుతామని చెప్పిన ప్రభుత్వం వాటి వివరాలనూ వెల్లడించలేదు.

నోట్ల రద్దు పరిణామాలపై 2016 సంవత్సరం చివరి రోజున ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం నోట్ల రద్దు పరిణామాలు, మరికొన్ని కొత్త నిర్ణయాలు వెల్లడవుతాయని ఆశించిన ప్రజలకు మాత్రం నిరాశే మిగిల్చింది. 2017 నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రధాని కొన్ని వరాలు ప్రకటించినప్పటికీ వాటిపై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచలేదన్న అభిప్రాయం మాత్రం ఉంది.

మరిన్ని వార్తలు